- Home
- International
- ఎయిరిండియా ప్రమాదంనుండి బయటపడ్డ ఒకేఒక్కడు.. విశ్వాస్ కుమార్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
ఎయిరిండియా ప్రమాదంనుండి బయటపడ్డ ఒకేఒక్కడు.. విశ్వాస్ కుమార్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
Ahmedabad Air India Plane Crash : అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం నుండి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఎలా ఉన్నాడు? అతడి ఆరోగ్య, మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుడు విశ్వాస కుమార్ ప్రస్తుత పరిస్థితేంటి?
Air India plane crash : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం... కేవలం భారత్‌నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఘటన. ఈ భయానక ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 241 మంది చనిపోయారు. మరోవైపు మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఈ విమానం కూలడంతో అమాయక విద్యార్థులు కూడా బలయ్యారు. ఇలా ఈ ప్రమాదంలో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది.
అయితే ఈ ఘోర విమాన ప్రమాదం నుండి బతికి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ తన సోదరుడితో కలిసి ఈ విమానంలో ప్రయాణించాడు. మిగతా ప్రయాణికులతో పాటే అతడి సోదరుడు ప్రమాదంలో చనిపోగా విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికాడు. ఇంతటి ఘోర ప్రమాదంనుండి ప్రాణాలతో బైటపడ్డ విశ్వాస్ కుమార్‌ను లక్కీ మ్యాన్‌గా భావించారు.. కానీ ప్రస్తుతం ఇతడి పరిస్థితి దయనీయంగా మారినట్లు తెలుస్తోంది.
విశ్వాస్ కుమార్ కు ఏమైంది?
ఈ ఏడాది జూన్ 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది.. విమానంలో ఇంధనం నిండుగా ఉండటంతో ఇది కూలినచోట భారీ మంటలు చెలరేగి దగ్గర్లోని భవనాలు కూడా కాలిబూడిదయ్యాయి. ఇంతటి ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రతి ఒక్కరు మరణించారు... కానీ ఆశ్చర్యకరంగా ఒక్క విశ్వాస్ కుమార్ మాత్రం బతికి బయటపడ్డాడు.
ఈ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు విశ్వాస్. కానీ ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా మెంటల్ కండీషన్ దెబ్బతిందని... అతడు ఇంకా భయంభయంగానే ఉంటున్నాడని తెలుస్తోంది. ఈ ఘటనలో తోటి ప్రయాణికులు మరీముఖ్యంగా అప్పటివరకు తన పక్కనే ఉన్న సోదరుడు మరణించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోతున్నాడట. ఇలా తనకు అండగా నిలిచిన సోదరుడి మరణం, మరోవైపు ఈ భయానక దుర్ఘటన విశ్వాస్ కుమార్‌ను మానసికంగా, శారీరకంగా కుంగదీసింది.
భార్య, కొడుకుతో మాటల్లేవు, ఒంటరివాడైన విశ్వాస్
విశ్వాస్ కుమార్ మళ్ళీ మామూలు మనిషి కావాలని అనుకుంటున్నాడు... కానీ అది సాధ్యం కావడం లేదు. ఆ ప్రమాద ఘటన అతడు అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. ఈ ప్రమాద నుండి బయటపడి బతికి ఉన్నానని కూడా అతడు నమ్మలేకపోతున్నాడట. సోదరుడిని కోల్పోయిన బాధతో విశ్వాస్ కుమార్ కుంగిపోతున్నాడు... ఇంట్లో ఉన్నా గదిలోకి వెళ్లి ఒంటరిగా ఉంటున్నాడట. భార్య, కొడుకుతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు... ఒంటరితనంలోనే జీవితం గడుపుతున్నాడు. తాను అంతా కోల్పోయినట్లు అనిపిస్తోందని తాజాగా విశ్వాస్ కుమార్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు
ప్రమాదం నుంచి కలిగిన షాక్ నుంచి విశ్వాస్ కుమార్ ఇంకా బయటపడలేదని అతడి తాజా ఇంటర్వ్యూను బట్టి అర్థమవుతోంది. కళ్ళముందే సోదరుడు చనిపోవడంతో అతడి మానసికంగా దెబ్బతిన్నాడు. శరీరానికి అయిన గాయాలు మానిపోయాయి... కానీ మనసుకు అయిన గాయం ఇంకా మానలేదు. తన పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు అనిపిస్తోందని విశ్వాస్ కుమార్ ఇంటర్వ్యూలో చెప్పారు.
తల్లి బాధ చూడలేకపోతున్నా.. విశ్వాస్ ఆవేదన
''సోదరుడు అజయ్ మా అందరికీ బలం. అజయ్ మరణం నాకు మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరికీ షాక్ ఇచ్చింది. మా అమ్మ ప్రతిరోజూ గుమ్మం దగ్గర కూర్చుని సోదరుడి కోసం ఎదురుచూస్తారు… ఎవరితోనూ మాట్లాడటం లేదు. నాకు కూడా ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. ఇల్లు నిశ్శబ్దంగా మారింది. నేను మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాను'' అని విశ్వాస్ కుమార్ చెప్పారు.
విశ్వాస్ కుమార్ కు ఆర్థిక సమస్యలు
''విమాన ప్రమాదం తర్వాత చాలాకాలం చికిత్స తీసుకున్నాను... కానీ ఇప్పటికీ నొప్పి తగ్గలేదు. పని చేయలేకపోతున్నాను... కనీసం సొంతంగా డ్రైవ్ చేయలేకపోతున్నాను. కుటుంబ పోషణ కష్టమవుతోంది. ప్రమాదంనుండి బయటపడిన తనకు పరిహారంగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ అది ఇక్కడి పరిస్థితులకు సరిపోవడం లేదు. అందమైన జీవితం దుర్భరంగా మారింది. ఆర్థిక వనరులు ఆగిపోయాయి. మానసిక సమస్యలు వేధిస్తున్నాయి'' అని విశ్వాస్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
''సమస్యల గురించి చెప్పి పరిష్కార మార్గం సూచించమని ఎయిర్ ఇండియా వాళ్లతో మాట్లాడాను... కానీ నా అభ్యర్థనను తిరస్కరించారు. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాను. ముందు ఏం చేయాలో తోచడం లేదు'' అని ఎయిర్ ఇండియా ప్రమాదంనుండి బయటపడ్డ విశ్వాస్ కుమార్ చెప్పారు.