ఆకాశం నుండి భూమిపైకి దూసుకువచ్చిన 500 కిలోల భారీ రింగ్ ... ఇదేమిటో తెలుసా?
ఇటీవల ఆకాశం నుండి ఓ వింత లోహపు పదార్థం భూమిపైకి దూసుకువచ్చింది. దాదాపు 500 కిలోల బరువు. 2.5 మీటర్ల వ్యాసం గల ఈ రింగ్ ఏమిటో తెలుసా?
Space debris crash in Kenya village
Space debris crash in Kenya village : ఈ అనంత విశ్వంలో మనం నివసించే భూమి ఓ చిన్న గ్రహం మాత్రమే. అంతరిక్షంలో ఈ భూమిలాగే అనేక పదార్థాలు వున్నాయి...వీటిలో గ్రహశకలాలు కూడా ఒకటి. ఇలాంటి గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదం వుందా? అంటే అవుననే అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. గత సంవత్సరంలో కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది.
అయితే భవిష్యత్ లో గ్రహశకలాలు భూమివైపు దూసుకువచ్చే ప్రమాదం వుందని... అంత దగ్గరగా కొన్ని గ్రహశకలాలు వున్నట్లు అంతరిక పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్లే అమెరికన్ స్పెస్ ఏజన్సీ నాసా ఇప్పటికే గ్రహశకలాలు భూమిని ఢీకొనకుండా అడ్డుకునేందుకు పరిశోధనలు చేయాలని నిర్ణయించింది.
ఇలా అంతరిక్షంలోని పదార్థాల వల్ల భూమికి ప్రమాదం పొంచివుందన్న చర్చ సాగుతున్న వేళ కెన్యాలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుండి ఓ వింత వస్తువు కెన్యా భూభాగంపై పడింది. ఈ భారీ వస్తువు జనావాసాలపై కాకుండా అడవిలో పడటంతో ప్రాణనష్టం తప్పింది. ఇలా హఠాత్తుగా ఆకాశంనుండి పడిన ఈ వస్తువు ఏమిటన్నది అంతుచిక్కకుండా వుంది.
Space debris crash in Kenya village
కెన్యా స్పెస్ ఏజన్సీ ఏమంటోంది :
కెన్యాలోని ముకుకు గ్రామానికి సమీపంలో ఓ లోపపు పదార్థం ఆకాశంనుండి పడినట్లు కెన్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. ఇది దాదాపు 2.5 మీటర్ల వ్యాసం, 500 కిలోల బరువున్న భారీ మెటల్ రింగ్ గా పేర్కొన్నారు. డిసెంబర్ 30, 2024న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఇది భూమిని తాకినట్లు కెన్యా పరిశోధకులు తేల్చారు.
ఇప్పటికే ఈ లోహపు రింగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు కెన్యా స్పెస్ ఏజన్సీ తెలిపింది. ఇదేమిటి? ఎక్కడినుండి వచ్చింది? తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దీనిపై కెన్యా స్పెస్ ఏజన్సీ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
అయితే ప్రాథమిక అంచనా ప్రకారం ఇది అంతరిక్ష లాంచ్ వెహికిల్ (రాకెట్) కు సంబంధించిందిగా అనుమానిస్తున్నామని కెన్యా స్పేస్ ఏజన్సీ వెల్లడించింది. సాధారణంగా రాకెట్ శకలాలు అంతరిక్షంలోనే వుండిపోయేలా లేదా సముద్రంలో పడిపోయేలా చూస్తారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తిరిగి భూమిని తాకుతుంటాయి.కెన్యాలో పడిన లోహం కూడా ఇలాంటిదే అయివుంటుందని భావిస్తున్నారు.
అయితే ఈ లోహపు రింగ్ గురించి పూర్తిస్థాయిలో పరిశోధన చేసాక వివరాలను వెల్లడిస్తామని కెఎస్ఏ తెలిపింది. ఇప్పటికే ఈ లోహపు రింగ్ పడిన ముకుకు ప్రాంతాన్ని కూడా తమ పరిశోధకులు పరిశీలించారని తెలిపింది. ఈ లోహాన్ని అక్కడినుండి తరలించినట్లు కెన్యా స్పేస్ ఏజన్సీ వెల్లడించింది.
ఈ లోహపు రింగ్ గ్రహాంతరవాసులదా?
కెన్యాలో పడ్డ లోహపు రింగ్ పై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇది గ్రహాంతవాసులది అయివుంటుందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇది రాకెట్ శిథిలం అయివుంటుందని కెన్యా స్పెస్ ఏజన్సీ చెప్పినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. గ్రహాంతవాసులకు చెందిన అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ (UFO) కు చెందినదిగా ప్రచారం జరుగుతోంది.
ఇక మరోవైపు ఈ లోహపు రింగ్ అంతరిక్షం నుండి వచ్చివుంటుందని మరో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రాకెట్ కు సంబంధించిన పదార్థాలు తిరిగి భూవాతావరణంలో వచ్చేలోపే దహనం అయిపోతాయి. అలాకాకుండా ఈ లోహం అసలు వేడెక్కినట్లుగా కూడా లేదట. కాబట్టి ఇదేదో ఇతర గ్రహాలు లేదంటే అంతరిక్షంలోంచి వచ్చిందని అంటున్నారు. ఇటీవల కాలంలో ఆస్టరాయిడ్స్ భూమికి సమీపంగా వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇదికూడా అలాగే భూమిపైకి వచ్చివుంటుందని ప్రచారం జరుగుతుంది.
అయితే ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని... అంతరిక్ష పరిశోధనా సంస్థలు సాంకేతికంగా పరీక్షించి ఇదేమిటో నిర్దారిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయని అంటున్నారు. కాబట్టి కెన్యాలో ఆకాశం నుండి దూసుకువచ్చిన లోహపు పదార్థం గురించి కూడా తప్పుడు ప్రచారం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.