కీళ్ల నొప్పులకు సంబంధించి ఈ విషయాలను అస్సలు నమ్మకండి
world arthritis day 2023 : ప్రతి ఏడాది అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఆర్థరైటిస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా ఆర్థరైటిస్ గురించి నమ్మకూడని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Arthritis
ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఆర్థరైటిస్ పేషెంట్లకు ఈ వ్యాధి గురించి తెలియజేస్తారు. అసలు ఎన్ని రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. ప్రారంభ దశలో ఎలాంటి చికిత్స తీసుకోవాలి. ఈ వ్యాధి మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? వీటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు.
arthritis
ఆర్థరైటిస్ వల్ల కీళ్లలో మంట, నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే కీళ్లలో నొప్పులు, కీళ్ల వాపు, దృఢత్వానికి కారణమవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి జీవితంపై మాత్రమే కాకుండా మొత్తం సమాజంపై ప్రభావం కూడా చూపుతుంది. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడుతున్న వారు సమాజానికి దూరంగా ఉంటారు. అయితే ఆర్థరైటిస్ గురించి చాలా మంది ఎన్నో అపోహలను నమ్ముతున్నారు. దీనివల్లే సమస్యను పెద్దది చేసుకుంటుననారు. ఆ అపోహలేంటి, వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
world arthritis day
అపోహ 1: ఆర్థరైటిస్ కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి
వాస్తవం: దీనిలో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ వంటి కొన్ని ఆర్థరైటిస్ ల రకాలు యువకులకు కూడా వస్తాయి.
అపోహ 2: ఆర్థరైటిస్ వల్ల జస్ట్ మోకాళ్ల నొప్పులు మాత్రమే వస్తాయి
వాస్తవం- కీళ్ల నొప్పులు దీని లక్షణమే కావొచ్చు. అయితే చాలా సార్లు ఎక్కువసేపు కూర్చున్న తర్వాత.. లేచి నడిచినప్పుడు మోకాళ్లలో బిగుతుగా అనిపిస్తుంది. వీటితో పాటుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉదయం లేవగానే చేతులకు దృఢత్వాన్ని కలిగిస్తుంది.
అపోహ 3: ఆర్థరైటిస్ రోగులు వ్యాయామం చేయకూడదు
వాస్తవం- ఇది కూడా అపోహే. ఆర్థరైటిస్ రోగులు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అయితే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నొప్పిని కలిగించే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.
అపోహ 4:దీనిని నయం చేయడానికి ఏం చేయలేరు.
వాస్తవం: ఇది కూడా నిజం కాదు. ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత కూడా దీనిని మీరు తగ్గించుకోవచ్చు. అయితే ఇది ఆర్థరైటిస్ దశపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం జీవనశైలిలో మార్పులు, ఫిజియోథెరపీ, మందులు, కీళ్లలో ఇంజెక్షన్లు, అవసరమైతే శస్త్రచికిత్స వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.
అపోహ 5: ఆర్థరైటిస్ సమస్య వర్షం, చలిలో పెరుగుతుంది.
వాస్తవం- అవును చల్లని వాతావరణం ఆర్థరైటిస్ సమస్యను పెంచుతుంది, ముఖ్యంగా రుమటాయిడ్ పాలి ఆర్థరైటిస్ వంటి తాపజనక ఆర్థరైటిస్. అంటే ఈ సీజన్లో వాపు పెరుగుతుందన్న మాట. ఇది కీళ్లలో నొప్పిని కలిగిస్తుంది.