కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆహారాలను అస్సలు తినొద్దు.. ఒకవేళ తిన్నారో నొప్పి పెరుగుతుంది జాగ్రత్త
world arthritis day 2023: ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పెరుగుతున్న ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. అయితే ఆర్థరైటిస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు కీళ్లు, కాళ్ల నొప్పులను మరింత పెంచుతాయి.
ఆర్థరైటిస్ ఒక వ్యక్తి కీళ్లలో నొప్పి, వాపును కలిగిస్తుంది. అంతేకాదు ఈ సమస్య బలహీనత, జ్వరం లక్షణాలు కూడా కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ సమస్య అన్ని వయసుల వారికీ వస్తోంది. మీరు కూడా ఆర్థరైటిస్ పేషెంట్ అయితే మీ ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. అసలు ఆర్థరైటిస్ పేషెంట్లు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువ చక్కెర
తీపి పదార్థాలు చాలా టేస్టే టేస్టీగా ఉంటాయి. అలాగని వీటిని ఎక్కువగా తింటే మాత్రం కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి. మీకు కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం తీపీ పదార్థాలను తినడం మానుకోండి. చాక్లెట్, సోడా, మిఠాయి, జ్యూస్ లు, స్వీట్ డ్రింక్స్, కొన్ని సాస్ లలో కూడా చక్కెర ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి.
గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది గోధుమ, బార్లీ తో సహా కొన్ని ఇతర ధాన్యాలలో ఉంటుంది. గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఆర్థరైటిస్ రోగులు గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలను అతిగా తినకూడదు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ ను తినేవారు ఎక్కువే. ఎందుకంటే ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ మన ఆరోగ్యానికి ఏ రకంగానూ మేలు చేయవు. వీటిని తింటే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిలో శుద్ధి చేసిన చక్కెర, శుద్ధి చేసిన ఆహార ధాన్యాలను ఉపయోగిస్తారు. ఇవి ఆర్థరైటిస్ నొప్పి, మంటను మరింత పెంచుతాయి. అందుకే ఆర్థరైటిస్ పేషెంట్లు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
మద్యం
మందును విపరీతంగా తాగడం వల్ల ఎన్నో రోగాల ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి పెరుగుతుంది. ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు మందును తాగితే సమస్య మరింత పెరుగుతుంది.
Image: Getty
ఉప్పు ఎక్కువగా తినకూడదు
అతి ఏదైనా సరే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇది ఉప్పుకు కూడా వర్తిస్తుంది. అవును ఉప్పును అతిగా తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి బాగా పెరుగుతుంది. ప్యాకెట్ ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్ రోగులు ఆహారంలో ఉప్పు తక్కువగా చేర్చుకోవాలి.