రోజులో నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసా?
నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. మనం నీళ్లు పుష్కలంగా తాగితేనే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం. అయితే నీళ్లు మన ఆరోగ్యాన్ని కాపాడాలంటే మాత్రం నీళ్లను ఒక టైం ప్రకారమే తాగాలంటారు ఆరోగ్య నిపుణులు. అది ఎప్పుడెప్పుడంటే?
పొద్దున్నే లేవగానే..
నీళ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే మన శరీరానికి సరిపడా నీళ్లను తాగుతూ ఉండాలి. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మన శరీర అవయవాలు పనిచేయడానికి ఉత్తేజితమవుతాయి. అలాగే మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగితే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు.
వ్యాయామం తర్వాత..
వ్యాయామంతో బరువు తగ్గడమే కాకుండా శరీరం ఫిట్ గా కూడా ఉంటుంది. అయితే వ్యాయామం చేసేటప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని నియంత్రించాలంటే మీరు వ్యాయామం తర్వాత నీళ్లను ఖచ్చితగా తాగాలి. ఇది మీ హృదయ స్పందన రేటును సాధారణ స్థితికి తీసుకొస్తుంది.
స్నానానికి ముందు..
స్నానం చేసేటప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుందన్న మాటను మీరు వినే ఉంటారు. నిజానికి స్నానం చేసేటప్పుడు రక్తపోటు పెరగడం వల్లే గుండె పోటు వస్తుంది. అందుకే స్నానానికి ముందు నీళ్లను ఖచ్చితంగా తాగాలి. ఇది మీ అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
తినడానికి ముందు..
చాలా మంది తినేటప్పుడు నీళ్లను బాగా తాగుతుంటారు. లేదా తిన్న వెంటనే తాగుతుంటారు. కానీ నీళ్లను ఎప్పుడూ కూడా భోజనానికి సరిగ్గా 30 నిమిషాల ముందు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. తిన్నది బాగా అరగడానికి సహాయపడుతుంది.
నిద్రపోవడానికి ముందు..
రాత్రి పడుకునే ముందు నీళ్లను తాగితే తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని చాలా మంది నీళ్లను తాగకుండా ఉంటారు. కానీ రాత్రి పడుకునే ముందు నీళ్లను ఖచ్చితంగా తాగాల. ఎందుకంటే ఇది కొన్ని గంటల పాటు మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
అలసిపోయినప్పుడు..
బాగా పనిచేసినప్పుడు అలసటగా అనిపిస్తుంటుంది. ఒంట్లో శక్తి తగ్గినప్పుడే ఇలా అలసటగా ఉంటుంది. అయితే అలసటగా అనిపించినప్పుడు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, అలసటతో పోరాడటానికి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే అలసటగా ఉన్నప్పుడు మీరు నీళ్లను ఖచ్చితంగా తాగాలి.
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు..
చాలా మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు టీ, కాఫీలనే ఎక్కువగా తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరం నిర్జలీకరణం బారిన పడుతుంది. అందుకే అనారోగ్యంతో ఉన్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటానికి నీళ్లను తాగండి.