ఎక్కువ నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది నిద్రపోవడానికి ఇబ్బంది పడితే మరికొంతమంది మాత్రం గంటలకు గంటలు నిద్రపోతూనే ఉంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర అవసరమే కానీ.. అతిగా నిద్రపోతే మాత్రం లేనిపోని రోగాలు మాత్రం పక్కాగా వస్తాయి. ఎక్కువ సేపు నిద్రపోతే ఏమౌతుందో తెలిస్తే మళ్లీ అలా పడుకోవడానికే భయపడతారు తెలుసా?
కొందరికి అస్సలు నిద్ర పట్టదు. నిద్రపట్టడానికి ఎన్నో తిప్పలు పడే వారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది సెకన్లలో నిద్రలోకి జారుకుంటారు. నిద్ర మన శరీరానికి చాలా చాలా అవసరం. అలసిన శరీరాన్ని తిరిగి ఎనర్జిటిక్ గా మార్చడానికి నిద్ర ఎంతగానో సహాయపడుతుంది. కొంతమంది ఐదారు గంటలు నిద్రపోతే మరికొంతమంది మాత్రం ఏకంగా పది గంటలు కూడా నిద్రపోతుంటారు. ఇన్ని గంటల నిద్ర సరిపోని వారు కూడా ఉన్నారు. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ సేపు నిద్రపోతే ఎన్నో వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనిషికి కనీసం 8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 10 నుంచి 12 గంటలు నిద్రపోయే వారు కూడా ఉన్నారు. ఏ పనులు చేయకుండా ఖాళీగా ఉండటం వల్లే ఇలా నిద్రపోతారు. కానీ ఇది మిమ్మల్ని సోమరిగా మార్చడమే కాదు మీకు ఎన్నో రోగాలు వచ్చేలా కూడా చేస్తుంది. అసలు ఎక్కువ సేపు నిద్రపోతే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఒత్తిడి
2014 లో.. ఎక్కువసేపు నిద్రపోయే వ్యక్తులపై ఒక అధ్యయనం జరిగింది. అయితే వీరిలో ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు కనుగొనబడింది. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో డిప్రెషన్ కు గురయ్యే అవకాశం 27 శాతం ఉండగా, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి 49 శాతం ఈ ప్రమాదం ఎక్కువ ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భందాల్చడంలో ఇబ్బంది
ఎక్కువ సేపు నిద్రపోయే ఆడవారు తల్లులు కావడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. 650 మంది ఆడవారిపై నిర్వహించిన సంతానోత్పత్తి పరీక్షలో.. రోజుకు 7 లేదా 8 గంటలు నిద్రపోయే మహిళలు గర్భం ధరించే అవకాశం ఉందని కనుగొన్నారు. అలాగే 9 లేదా 11 గంటలు నిద్రపోయే ఆడవారు గర్భందాల్చే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. నిద్రవేళలో వ్యత్యాసం మన శరీరంలోని హార్మోన్ గ్రంథుల పనితీరును ప్రభావితం చేసి రుతుచక్రానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
డయాబెటిస్
రాత్రిపూట 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక వైద్య పరిశోధన ప్రకారం.. రాత్రిపూట 7 లేదా 8 గంటలు నిద్రపోయే వ్యక్తుల గ్లూకోజ్ స్థాయిలపై పెద్దగా ప్రభావం పడదు.
బరువు పెరగడం
రాత్రిపూట 7 లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే ఆడవారు ఓవర్ వెయిట్ తో ఉన్నట్టు కనుగొనబడింది. ఒక వైద్య అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట 9-10 గంటలు నిద్రపోయే ఆడవారికి సరైన ఆహార నియంత్రణ, వ్యాయామం ఉన్నప్పటికీ వారి శరీర బరువులో 25% పెరిగారు. స్థూలకాయానికి, బరువు పెరగడానికి నిద్ర సమయం కూడా ఒక ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.