Heart Health: ఈ ఒక్క అలవాటు.. పొగ తాగడంతో సమానం..!
Heart Health: చిన్న చిన్న అలవాట్లు కూడా మన శరీరానికి పెద్ద హాని కలిగించవచ్చు. ఉదాహరణకు భోజనం చేసిన వెంటనే కూర్చోవడం, ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం, వాకింగ్ లాంటివి చేయకపోవడం వల్ల కూడా కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గుండె ఆరోగ్యం..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా పొగ తాగే వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ... కేవలం పొగతాగడం మాత్రమే కాదు... మనకు ఉండే కొన్ని అలవాట్లు కూడా మన గుండెను ప్రమాదంలో పడేస్తాయి. మరి, ఆ అలవాట్లు ఏంటి? ఏ అలవాట్లు దూరంగా ఉంచితే.. ఆరోగ్యంగా ఉంటాం అనే విషయం తెలుసుకుందాం....
తినగానే కూర్చోవడం...
మనలో చాలా మంది చేసే కామన్ తప్పు ఏదైనా ఉంది అంటే... భోజనం చేయగానే శరీరానికి రెస్ట్ ఇస్తారు. వెంటనే కూర్చోవడానికి మక్కువ చూపిస్తారు. కానీ, నిపుణుల ప్రకారం భోజనం చేసిన తర్వాత వెంటనే కూర్చోకూడదు. దీనిని చాలా మంది సీరియస్ గా తీసుకోరు. కానీ... దీని వల్ల మనకు ఎన్ని నష్టాలు కలుగుతాయో ఎప్పుడైనా ఊహించారా? ఎక్కువ సేపు కూర్చోవడం కూడా పొగ తాగడంతో సమానం అంటే నమ్మగలరా? వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
వైద్యులు ఏమంటున్నారంటే...
తిరువనంతపురంలోకి కిమ్స్ హెల్త్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ డేవిడ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.... ‘భోజనం చేసిన వెంటనే కూర్చోవడం పొగతాగడం తో సమానం. రోజుకి 8 గంటలకు పైగా కదలకుండా కూర్చోవడం మాత్రం చాలా ప్రమాదకరం. ఇది గుండె ఆరోగ్యాన్ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది’ అని చెప్పారు.
‘ నిలబడినప్పుడు లేదా నడవడం కంటే కూర్చోవడం వల్ల శరీర జీవక్రియ ( Metabolism) దాదాపు 30 శాతం వరకు తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల తొందరగా బరువు పెరుగుతారు. అలాగే రక్త నాళాల్లో కూడా కొవ్వు పేరుకుపోతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.’ అని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. చేసే పనులు కూడా కుర్చీల్లో కూర్చొని చేసే పనులే. ఫలితంగా శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. గంటల తరబడి కూర్చోవడం వల్ల జీవక్రియ రుగ్మతలు, ఉబకాయం, గ్లూకోజ్ టోలరెన్స్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు భవిష్యత్తులో రావడానికి సిగ్నల్స్ అని చెప్పొచ్చు.
ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి?
రోజూ కచ్చితంగా 8 గంటలు కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నా... మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోవాలి. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి లేచి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నడవాలి. కూర్చొన్న చోటి నుంచే చిన్న పాటి వ్యాయామాలు చేయవచ్చు. అంతేకాదు... మీ వర్కింగ్ టేబుల్ పక్కనే మంచి నీళ్ల బాటిల్ పెట్టుకోవద్దు. నీరు తాగాలి అనిపించినప్పుడు లేచి వెళ్లి... వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇక.. పని చేసే కుర్చీ, టేబుల్ ని సరైన ఎత్తులో ఉంచి వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
కదలకుండా ఎక్కువ సేపు కూర్చోవడం శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, అలసట వంటి సమస్యలను పెంచే అవకాశం ఉంది. అందుకే... మీరు ఎంత బిజీగా ఉన్నా , శరీరానికి కనీస వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.... గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.