ఉప్పు నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందా?
జుట్టు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ఆడవాళ్ల గురించి అయితే చెప్పనవసరం లేదు. అందమైన, పొడవైన జుట్టు అంటే మహిళలు చాలా ఇష్టపడతారు. జుట్టును కాపాడుకోవడానికి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాస్త జుట్టు రాలిందంటే చాలు ఎక్కడ లేని కంగారు పడతారు. సాధారణంగా జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ చాలా మంది డౌట్ ఏంటీ అంటే.. ఉప్పునీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందని. అయితే అది నిజమా లేక అపోహా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే.. మరికొందరు రోజు విడిచి రోజు చేస్తారు. ప్రతి రోజూ తలస్నానం చేసేవారు కూడా లేకపోలేదు. సాధారణంగా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు నది, బావి నీటితో స్నానం చేస్తుంటాం. అప్పుడు చాలా మందికి జుట్టుపై ఎలాంటి కంప్లెంట్స్ ఉండవు. కానీ వృత్తిరిత్యా, ఉద్యోగరిత్యా బయటకు వచ్చినప్పుడు జుట్టుతో కొత్త చిక్కు స్టార్ట్ అవుతుంది. మెల్లగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనికి ఉప్పు నీరే కారణమని చాలామంది అనుకుంటారు.
జుట్టు రాలడానికి కారణాలు
సాధారణంగా జుట్టు రాలడానికి చాలా కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైనది వేర్లలో సమస్య. మగవారిలో బట్టతల రావడానికి హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం. కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపం, వృద్ధాప్యం వంటివి కూడా జుట్టు రాలడానికి కారణాలు.
అది అపోహ మాత్రమే
నది నీరు, వర్షపు నీటిని మృదువైన నీరు అంటారు. వీటిలో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, సల్ఫైడ్ వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నీటితో స్నానం చేస్తే జుట్టు రాలదని నమ్ముతుంటారు. బోర్ నీటిలో కాల్షియం, కార్బోనేట్, మెగ్నీషియం, సల్ఫేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ నీటితో తలస్నానం చేసినప్పుడు, దానిలోని లవణాలు జుట్టు వేళ్ళలో చేరి జుట్టు స్వభావాన్ని మార్చి జుట్టు రాలడానికి దారితీస్తుందని కొందరు అపోహ పడుతుంటారు.
అయితే, నీటి సమస్య వల్లే జుట్టు రాలుతుందనేది అపోహ మాత్రమే. నిజానికి మన తల పైభాగం నుంచి జుట్టు వేరు వరకు నీరు వెళ్లదు. కాబట్టి ఉప్పు నీటితో స్నానం చేసినా జుట్టు రాలే అవకాశం లేదు.
పరిశోధనలోనూ...
దీనిపై ఒక పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో 20 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి 10 మంది బోర్ నీటితో, మిగిలిన 10 మంది నది నీటితో నెల రోజులపాటు స్నానం చేశారు. ఆ తర్వాత 20 మంది జుట్టును పరీక్షించగా.. వారి జుట్టులో ఎలాంటి తేడా లేదు. జుట్టు బలం ఒకేలా ఉంది. కాబట్టి ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలుతుందనేది అపోహ మాత్రమే.
డాక్టర్ ను సంప్రదించండి
జుట్టు రాలడానికి హార్మోన్లు లేదా పోషకాహార లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. మీకు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటే, మంచి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.