కడుపు ఉబ్బరానికి అసలు కారణాలు ఇవే
ఈ రోజుల్లో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయకపోడమే. కానీ కొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరం ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. అవేంటంటే?

కడుపు ఉబ్బరం
చాలా మందికి కడుపు ఉబ్బరం లేదా అపానవాయువు సమస్య ఉంటుంది. ఇది కామన్ విషయమే. ఈ ఉబ్బరం సాధారణంగా మలబద్దకం, గ్యాస్ వంటి కారణాల వల్ల వస్తుంది. అయితే ఇది చాలా తొందరగా తగ్గిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా సేపటి వరకు ఉంటుంది. మీకు పదేపదే ఈ సమస్య వస్తే గనుక దీనికి వేరే కారణాలు ఉన్నట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మీకు ఉబ్బరం సమస్య ఎక్కువ సేపు ఉన్నా, పదేపదే వస్తున్నా హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తరచూ ఉబ్బరం సమస్య రావడానికి కారణాలు
హార్మోన్ల అసమతుల్యత: హార్మోన్లు సమతుల్యంగా లేకపోయినా కూడా ఉబ్బరం సమస్య వస్తుంది. ఇది ఎక్కువ ఆడవారికే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పీరియడ్స్: పీరియడ్స్ వల్ల కూడా ఉబ్బరం సమస్య రావొచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పీరియడ్స్ ప్రారంభానికి ముందు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
థైరాయిడ్ : ఉబ్బరానికి థైరాయిడ్ కూడా ఒక కారణమే. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడు జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల మన జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది. అలాగే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలాగే రుతువిరతి వల్ల కూడా ఉబ్బరం సమస్య వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ప్రకోప ప్రేగు సిండ్రోమ్: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వల్ల కూడా ఉబ్బరం సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల గ్యాస్, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. మీకు గనుక ఈ సమస్య ఉంటే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి.
కడుపు ఉబ్బరం
లాక్టోస్ అసహనం: లాక్టోస్ కు అసహనం ఉన్నవారికి కూడా ఉబ్బరం సమస్య ఎక్కువగా వస్తుంది. అంటే పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తింటే కొంతమందికి ఇలా అవుతుంది. ఈ పాల ఉత్పత్తుల్లో లాక్టోస్ ఉంటుంది. ఇది జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
ఉదరకుహర వ్యాధి: ఉదరకుహర వ్యాధి వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. మీరు గ్లూటెన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ను తినడానికి మీ ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల చిన్న పేగు దెబ్బతింటుంది. దీనివల్ల విరేచనాలు, కడుపు ఉబ్బరం, వంటి సమస్యలు వస్తాయి.
మలబద్ధకం: మలబద్దకం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుందది. అంటే మీకు చాలా రోజులుగా ఈ సమస్య ఉంటే ఉబ్బరం సమస్య రావడం సర్వ సాధారణం. దీనివల్ల మలం పేగుల్లో పేరుకుపోతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం, కడుపులో బరువుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కడుపు ఉబ్బరం
కాలేయం లేదా గుండె జబ్బులు ఉంటే కూడా మీకు కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. గుండె జబ్బుల లక్షణాలతో పాటుగా ఇది కూడా ఉంటే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే. అలాగే కాలెయ వ్యాధి ఉంటే కూడా ఉబ్బరం సమస్య వస్తుంది. అంటే కాలెయం ఎర్రబడటం, కడుపులో ద్రవం పేరుకుపోవడం వల్ల కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. దీనితో పాటుగా అలసట, బరువు తగ్గడం, కామెర్లు వంటి లక్షణాలు కూడా కాలెయ సమస్యలను సూచిస్తాయి.
గుండె వైఫల్యం: గుండె వైఫల్యం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అయితే మన గుండె శరీర భాగాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయనప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల కాళ్లలో వాపు, అలసట, కడుపు ఉబ్బరం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి?
మీకు కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువ కాలంగా ఉంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. మందులు వాడుతున్నా, ఫుడ్ ను మార్చుతున్నా ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. అలాగే కడుపు ఉబ్బరంతో పాటుగా వాంతులు, విపరీతమైన కడుపు నొప్పి, విరేచనాలు ఉంటే గనుక హాస్పటల్ కు వెళ్లాలి. అలాగే బరువు తగ్గడం, శ్వాస ఆడకపోవడం, మలంలో రక్తం రావడం, కాళ్ల వాపు, కళ్లు పసుపు రంగులోకి మారితే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి.