పురుషులు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని యూజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది పురుషులు ల్యాప్ టాప్ ను ఎక్కువగా ఒడిలో పెట్టుకుని ఉపయోగిస్తుంటారు. అసలు దీనివల్ల ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించరు. ఇదే పురుషులకు ఆ సమస్యలు వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty
నేడు ల్యాప్ టాప్ మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీనిని అవసరానికే ఉపయోగించినా.. దీని వాడకం సరిగ్గా లేకపోతే మాత్రం మీరు లేనిపోని వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంుటన్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ల్యాప్టాప్ ను గంటల తరబడి మగవారు ఒడిలో పెట్టుకోవడం వల్ల వారి పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
నిరంతరం వేడికి గురికావడం వల్ల వృషణాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే పురుషుల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అలాగే స్మెర్మ్ నాణ్యత కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే పురుష పునరుత్పత్తి వ్యవస్థ ఉష్ణోగ్రత వైవిధ్యాలకు చాలా సున్నితంగా ఉంటుంది. స్పెర్మ్ ఉత్పత్తి, పనితీరుకు వాతావరణం చల్లగా ఉండటం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
laptop
ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకున్నప్పుడు దాని నుంచి వచ్చే వేడి వృషణాల్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది 'స్క్రోటల్ హైపర్థెర్మియా' అని పిలువబడే సమస్యకు దారితీస్తుంది. ఇది ఫలదీకరణానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తి కూడా బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ల్యాప్ టాప్ లు తరచుగా విద్యుదయస్కాంతత్వాన్ని విడుదల చేస్తాయి. ఇది స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ల్యాప్ టాప్ రేడియేషన్ కు ఎక్కువగా గురికావడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది స్పెర్మ్ కణాలను నాశనం చేస్తుంది. అలాగే వాటి చలనశీలత తగ్గుతుంది. పనితీరు కూడా ప్రభావితం అవుతుంది.
laptop
అయితే ల్యాప్ టాప్ నుంచి వచ్చే వేడి, రేడియేషన్ స్పెర్మ్ నాణ్యత, పరిమాణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై మరిన్ని పరిశోధనలు అవసరం. కానీ ల్యాప్ టాప్ ను మీ ఒడిలో పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలు రాకూడదంటే పురుషులు ల్యాప్ టాప్ ను ఒడిలో అస్సలు పెట్టుకోకూడదు.