ఉదయం ఎంత సేపు వాకింగ్ చేయాలో తెలుసా?
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది పొద్దు పొద్దున్నే వాకింగ్ కు వెళతారు. వాకింగ్ బరువును తగ్గించడమే కాకుండా.. శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఉదయం పూట ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిదో తెలుసా?
ఆరోగ్యంగా ఉండటానికి మంచి పౌష్టికాహారాన్ని తినడం ఎంత ముఖ్యమో.. శారీరక శ్రమ చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మార్నింగ్ వాక్. నిజానికి మార్నింగ్ వాక్ మనల్నిఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది తెలుసా? చాలా మంది కేవలం బరువు తగ్గాలనే వాకింగ్ కు వెళతారు. కానీ మార్నింగ్ వాక్ వల్ల మీరు బరువు తగ్గడంతో పాటుగా ఎన్నో వ్యాధుల ప్రమాదాల్ని తగ్గించుకుంటారని డాక్టర్లు చెప్తారు. కానీ మనలో చాలా మంది సోమరితనం వల్ల ఉదయం వాకింగ్ కు అసలే వెళ్లరు. అందులోనూ ఉదయం 8, 9 గంటలకు నిద్రలేస్తారు.
శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉదయాన్నే వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం 20 నుంచి 30 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి. మరి మార్నింగ్ వాక్ వల్ల మనకు కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మన శరీరం ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండటానికి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. మన రోగనిరోధక శక్తి పెరగడానికి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటుగా రోజూ వాకింగ్ కు వెళ్లడం కూడా అవసరమేనంటున్నారు నిపుణులు. ఉదయం ఫ్రెష్ గాలిలో కాసేపు నడవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల కీళ్లకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నొప్పిని చాలా వరకు తగ్గుతుంది. అలాగే మంచి అనుభూతి కలుగుతుంది.
walking
బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. ఇబ్బంది పడకుండా బరువు తగ్గాలంటే మాత్రం మీరు రోజూ బాగా నడవాలి. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా మీరు ఎంత పాస్ట్ గా నడిస్తే అంత ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
గుండె ఆరోగ్యం: ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు రోజూ ఉదయం వాకింగ్ కు వెళితే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటీస్ తో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటైనా నడవాలి. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత మంచి హెల్తీ ఆహారాన్ని తినాలి. ఉదయాన్నే వాకింగ్ కు వెళితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
బీపీని నియంత్రిస్తుంది: అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా మార్నింగ్ వాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. హైబీపీతో బాధపడేవారు రోజూ ఉదయం 30 నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.