పళ్లు ఊడిపోతే హార్ట్ ఎటాక్ వస్తుందా?
కొన్నేళ్లుగా గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఓ తాజా అధ్యయనం విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది.
గుండెపోటు.. గుండెకు సంబంధించిన ప్రాణాంతకమైన వ్యాధి ఇది. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా, ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటాక వచ్చే గుండె జబ్బులు... ఇప్పుడు చాలా చిన్న వయసులోనే వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలుంటున్నాయి.
గత కొన్నేళ్లుగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వయసులతో సంబంధం లేకుండా అందరి ప్రాణాలు తీస్తోంది. యువకులు, స్కూల్ పిల్లలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవలి ఓ అధ్యయనం విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది.
పళ్లు ఉండిపోవడం వల్ల కూడా ప్రాణాంతకమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. తీవ్రమైన దంతాల నష్టం కారణంగా హృద్రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దంతాలను కోల్పోవడం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపిన గతంలోని ఫలితాలపై తాజాగా పరిశోధన నిర్వహించారు. గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపే కార్డియో వాస్కులర్ డిజీసెస్ ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఎండోడాంటిక్స్‌లో పేర్కొంది.
నోటి ఆరోగ్యం పట్టించుకోకపోవడం ప్రమాదకరమే...
నోరు, దంతాల శుభ్రత సరిగా లేకపోవడం గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. దంతాలు ఊడిపోవడం లేదా సరిగా నోటిని శుభ్రం చేసుకోని కారణంగా హానికరమైన వ్యాధికారకాలు చిగుళ్లలోకి చొచ్చుకుపోతాయని పరిశోధకులు గుర్తించారు. ఇది రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని... ఇంకా, గుండెను ప్రభావితం చేసే వాపును ప్రేరేపిస్తుందని వెల్లడించారు. దాంతో పాటు ధూమపానం (స్మోకింగ్), వ్యాయామ అలవాట్లు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం, రక్తపోటు లాంటి ఇతర అంశాలు కూడా గుండె ఆరోగ్యం, కార్డియో వాస్కులర్ వ్యాధుల(CVD) ప్రమాదాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
పరిశోధన ఇంకా ఏం చెబుతోంది?
అమెరికాలోని ఓహియోలో ఉన్న కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిఈలో ఎండోడాంటిస్ట్, దంత పరిశోధకురాలు అనితా అమినోషారియా నేతృత్వంలో దంతాల ఆరోగ్యం, గుండె సంబంధిత వ్యాధుల సంబంధంపై పరిశోధన నిర్వహించారు. తీవ్రమైన దంతాల నష్టం కార్డియో వాస్కులర్ డిసీజెస్ (CVD)కు దారితీస్తున్నట్లు గుర్తించారు. 3 నుంచి 49 సంవత్సరాల వరకు నోటి సంబంధిత సమస్యలు, CVD ఫలితాలను పర్యవేక్షించే 12 అధ్యయనాల నుండి డేటా తీసుకొని విశ్లేషించి చూశారు. తమ పరిశోధనలు పళ్లు ఊడిపోయే సమస్య.. హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తున్నట్లు స్పష్టమైన అంచనాలను వెల్లడించాయని డాక్టర్ అమినోషారియా వెల్లడించారు.
66 శాతం ప్రమాదం ఎక్కువే...
నోటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవడం కారణంగా దంతాలు ఊడిపోవడంతో పాటు రక్తంలో ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను, మరణాలను పెంచుతుంది. పెద్ద సంఖ్యలో దంతాలను కోల్పోయినవారు గుండె సంబంధిత సమస్యలతో చనిపోయే ప్రమాదం 66 శాతం ఎక్కువగా ఉందని పరిశోధన వెల్లడించింది. 10 కంటే తక్కువ దంతాలు ఉన్న వ్యక్తులతో పాటు పూర్తిగా పళ్లు ఊడిపోయిన వారిపై జరిపిన పరిశోధనలో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. సుమారు 22 లేదా అంతకంటే ఎక్కువ దంతాలను కోల్పోయినవారు కార్డియో వాస్కులర్ వ్యాధుల బారిన పడి చనిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపించింది.
కాగా, 2019లో ప్రపంచ వ్యాప్తంగా మూడింట ఒక వంతు మరణాలు గుండెపోటు, స్ట్రోక్, అడ్డుపడిన ధమనులు, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి కార్డియో వాస్కులర్ డిసీజెస్ వల్లే సంభవించాయి. ఈ నేపథ్యంలో హృద్రోగాలకు దారితీసే దంత సంబంధిత సమస్యల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధనలు సూచించాయి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా CVDలకు కారకాలైన దంతాల సమస్యలు దరిచేరవని తేల్చాయి.