మీకు గుండె జబ్బులు రావొద్దంటే..!
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. రక్తాన్ని పంప్ చేయడానికి, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను, పోషకాలను సరఫరా చేయడానికి గుండె పనిచేస్తుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

heart health
గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. ప్రస్తుతం గుండె సమస్యలతో బాధపడేవారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ఆరోగ్య నిపుణులు ప్రకారం.. కొన్ని రకాల పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి పోషకాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కొవ్వులు సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చియా విత్తనాల్లో కూడా ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.
fiber
ఫైబర్స్
ఫైబర్ అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది జీర్ణక్రియను నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
పొటాషియం
పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఈ పొటాషియం అరటిపండ్లు, అవోకాడోలు, బచ్చలికూర, చిలగడదుంప వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది.
మెగ్నీషియం
మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే మరొక ముఖ్యమైన ఖనిజం. రక్తపోటు పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ డి
విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. మంటను తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపర్చడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చేపలు, గుడ్డులోని పచ్చసొన, పాలు, ధాన్యాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
heart
ఈ ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాలను తినడంతో పాటుగా అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, చక్కెరను తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గుండె జబ్బులు వచ్చేందుకు దారితీస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి. బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆహారం, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.