నీటి ఉపవాసం అంటే ఏంటి? దీనితో ఏవైనా లాభ నష్టాలున్నాయా?
వాటర్ ఫాస్టింగ్ ను సింపుల్ గా చెప్పాలంటే? కేవలం నీటిని మాత్రమే తాగాలి. అంటే దీనిలో 72 గంటల పాటు ఫుడ్ కు దూరంగా ఉండాలన్న మాట. మరి దీనివల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటో ఓ లుక్కేద్దాం పదండి.
బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్స్ ను ఫాలో అవుతుంటారు. కానీ డాక్టర్ సలహా మాత్రం తీసుకోరు. దీనివల్లే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అయ్యేందుకు, శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి ఎన్నో ఉపవాసాలు ఉంటున్నారు. ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి కూడా. వీటిలో వాటర్ ఫాస్టింగ్ కూడా ఉండి. అసలు ఈ వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి? దీని లాభ నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.
నీటి ఉపవాసం అంటే ?
ఈ ఉపవాసంలో నీళ్లను తప్ప మరే ఆహారాలను తీసుకోకూడదు. అంటే ఒక్క నీళ్లను మాత్రమే తాగాలన్న మాట. ఈ ఉపవాసాన్ని సుమారుగా 24 గంటల నుంచి 72 గంటల పాటు ఉంటుంటారు. ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ప్రస్తుతం చాలా మంది ఈ వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు. ఈ వాటర్ ఫాస్టింగ్ మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, కొవ్వును కరిగించడానికి, బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
వాటర్ ఫాస్టింగ్ ప్రయోజనాలు
వాటర్ ఫాస్టింగ్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫాస్టింగ్ క్యాన్సర్ కు గురయ్యే కణాలు వంటి దెబ్బతిన్న భాగాలను బాగు చేయడానికి లేదా వాటిని పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది.
వాటర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపవాసంతో ఇన్సులిన్ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అంటే ఇది డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్న మాట.
వాటర్ ఫాస్టింగ్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గడంతో మనకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
వాటర్ ఫాస్టింగ్ దుష్ప్రభావాలు
ఓన్లీ నీళ్లను మాత్రమే తాగడం వల్ల శరీరంలో కేలరీలు లోపిస్తాయి. దీంతో మన శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు. కానీ అకస్మత్తుగా బరువు తగ్గుతారు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కావదు. ఎందుకంటే దీనివల్ల మీరు ఉన్నపాటుగా బరువు పెరుగుతారు. ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల శరీరంలోని ఫ్యాట్స్ యే కాదు కండరాలు కూడా తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
కేవలం నీళ్లను మాత్రమే తాగితే మీలో ఎనర్జీ తగ్గుతుంది. దీంతో మీరు తరచుగా అలసిపోతారు. మైకం వంటి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని ఎలక్ట్రోలైట్లలో మార్పుకూడా వస్తుంది. దీంతో మీ బీపీ బాగా పడిపోతుంది. దీంతో హార్ట్ రిస్క్ లో పడుతుంది. ఇది ప్రాణాంతకమని నిపుణులు అంటున్నారు.
నీటి ఉపవాసం తో కూడా మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడొచ్చు. నీళ్లను తాగితే డీహైడ్రేషన్ ఏంటి అని డౌట్ వస్తుందా? మీరు కేవలం నీళ్లను మాత్రమే తాగితే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.