నట్స్ ను కాల్చి తినాలా? లేక పచ్చివే తినాలా? ఎలా తింటే మంచిదంటే?
గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పోషక లోపం పోతుంది. అయితే కొంతమంది వీటిని కాల్చి తింటే.. ఇంకొంతమంది అలాగే పచ్చివే తింటుంటారు. దీన్ని ఎలా తింటే మంచిదంటే?

Image: Getty Images
క్రమం తప్పకుండా గింజలను తింటే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే గింజలు పోషకాల భాండాగారం. వీటిని తింటే మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు అందుతాయి. బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, వేరుశెనగ మొదలైనవి గింజలను ఎంచక్కా తినొచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా గింజలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి.
cashew
వీటిని లిమిట్ లో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గింజలలో మెగ్నీషియం, సెలీనియం, భాస్వరం, విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అయితే గింజలు కొంతమంది కాల్చి తింటే.. ఇంకొంతమంది మాత్రం అలాగే పచ్చిగానే తింటారు. వీటిలో ఏవి ఆరోగ్యకరమైనవో ఇప్పుడు తెలుసుకుందాం..
roasted nuts
గింజలను కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు
గింజలను వేయించడం వల్ల వాటి టేస్ట్ మారుతుంది. ఆకృతి కూడా మారుతుంది. అలాగే కమ్మని వాసన వస్తుంది. వేయించడం వల్ల అవి మరింత క్రంచీగా మారుతాయి. ఈ గింజలను జీర్ణించుకోవడం కూడా సులువు అవుతుంది.
బరువు తగ్గేందుకు
ఒకవేళ మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్టైతే మీరు నూనెలో కాల్చిన గింజలను తినకపోవడమే మంచిది. నూనెలో కాల్చిన గింజలు వంటలో అదనపు నూనెకు కారణమవుతాయి. ఇది గింజల కొవ్వు, కేలరీల కంటెంట్ ను కొద్దిగా పెంచుతుంది. అందుకే వెయిట్ లాస్ అయ్యేవారు పొడి కాల్చిన లేదా ముడి గింజలను మాత్రమే తినాలి.
వేడి చేస్తే..
గింజలను వేయించేటప్పుడు వేడి వాటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల స్థాయిలను కొద్దిగా తగ్గిస్తుంది. కాల్చడం వల్ల వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు దెబ్బతింటాయి. ఇంకా వేడిలో సరిగా నిల్వ చేయకపోతే లేదా ఎక్కువసేపు సూర్యరశ్మికి గురైతే ఈ కొవ్వులు మొత్తమే పనికిరాకుండా పోతాయి. వీటి నుంచి చెడు వాసన వస్తుంది. రుచి కూడా అస్సలు మంచిగుండదు.
ఇంట్లోనే వేయించండి..
ఒకవేళ మీకు కాల్చిన గింజలే ఇష్టముంటే.. ఇంట్లోనే వేయించుకుని తినండి. కానీ వేయిస్తే వీటిలోని పోషకాలు తగ్గుతాయి. అదనపు కేలరీలు కూడా యాడ్ అవుతాయి. మార్కెట్ నుంచి ముడి గింజలను కొనుగోలు చేసి ఇంట్లో ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించి కాల్చండి. దీనివల్ల మీరు ఉష్ణోగ్రతను నియంత్రించొచ్చు, ఉప్పుగా ప్యాక్ చేసిన గింజలతో వచ్చే నూనె , అధిక సోడియంను నివారించొచ్చు. ఇంట్లో కొద్దిగా గింజలను వేయించడం వల్ల గింజలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చెడిపోయే అవకాశం కూడా తక్కువ. అంతేకాదు మీ ఇల్లు మొత్తం వీటి కమ్మని వాసనతో నిండిపోతుంది కూడా.
ఫైనల్ గా..
సాధారణంగా ఈ రెండు రూపాల్లోని గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిమధ్య పెద్దగా తేడా ఏం ఉండదుద. అయినప్పటికీ వీటిలోని పూర్తిపోషకాలను పొందాలంటే మాత్రం పచ్చి గింజలనే తినడం ఉత్తమం. ఎందుకంటే ఇవి కాల్చిన గింజల కంటే కొంచెం ఆరోగ్యకరమైనవి. మీరు కొనే గింజల్లో ఉప్పు లేదా మరే ఇతర మసాలా దినుసులు ఎక్కువగా లేకుండా చూసుకోండి.