రోజూ చిటికెడు సోంపు తింటే..!
సోంపులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే..

సోంపు ఎన్నో ఔషధ గుణాలు కలిగున్న మసాలా దినుసు. మధ్యాహ్నం భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను నమిలితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా తినే అలవాటు ఎంతో మందికి కూడా ఉంటుంది. ఈ అలవాటు ఎన్నో ఏండ్ల నాటిది కూడా. ఇవి నోటిని పునరుత్తేజపరచడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
Fennel seeds
సోంపు గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోంపు గింజల్లో స్థూల, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, సెలీనియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇతర విత్తనాలతో పోలిస్తే సోంపు గింజల్లో చాలా ఎక్కువ స్థాయిలో నైట్రేట్లు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భోజనం తర్వాత సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలంలో నైట్రైట్ పరిమాణం పెరుగుతుందని అధ్యయనాలు చూపించాయి. నైట్రేట్లు గుండె రక్త నాళాలను విస్తరిస్తాయి. అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. విశ్రాంతినిస్తాయి. గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
కొత్త రక్త నాళాలు ఏర్పడటానికి కూడా సోంపు సహాయపడుతుంది. దీనిలో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. సోంపులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. చెన్నైలోని అన్నా యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ లో ప్రచురితమైంది.
సోంపులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర పెరుగుదలను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అందుకే దీన్ని సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు. సోంపు నీరు మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. అంటే ఇది మూత్రం సాఫీగా వెళ్లేందుకు సహాయపడుతుందన్న మాట. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సోంపు గింజలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఒక చెంచా సోంపు గింజల్లో 20 కేలరీలు, ఒక గ్రాము ప్రోటీన్, రెండు గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటాయి. సోంపులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే మరొక యాంటీఆక్సిడెంట్.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సోంపు టీ ఉత్తమ పానీయంగా పరిగణించబడుతుంది. కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సోంపులో ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ మొదలైన లక్షణాలను తగ్గిస్తాయి.