అరటిపండే కాదు అరటికాయ కూడా ఆరోగ్యానికి మంచిదే.. దీనితో ఎన్ని లాభాలున్నాయో..!
అరటి పండ్లను తింటే తక్షణ శక్తి అందుతుంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లతో పాటుగా అరటికాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
అరటి పండ్లు పొటాషియం, ఫైబర్, తో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన మూలం. అరటిపండు కాలాలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా చవకగా లభిస్తాయి కూడా. ప్రతిరోజూ ఉదయం అరటిపండును తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది అరటిపండ్లను మాత్రమే తింటారు. అరటికాయలను అస్సలు తినరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరటిపండ్లే కాదు అరటి కాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అరటి కాయలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
green banana
అరటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మరి అరటికాయను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటే?
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అరటికాయలో ఫినోలిక్ సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సమ్మేళనాలు కడుపు , చిన్న ప్రేగు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీ గట్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతాయి. ఇవి ప్రీబయోటిక్ ప్రభావాన్నికూడా కలిగి ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
అరటికాయలో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండిన అరటిపండ్ల మాదిరిగానే.. కాయలు కూడా పొటాషియానికి అద్భుతమైన మూలం. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె లయను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది గుండెజబ్బుల ప్రమాదాన్నితగ్గిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది
పండిన అరటిపండ్ల కంటే అరటికాయలోనే చక్కెర కంటెంట్ తక్కువగా ఉంటుంది. అరటికాయలో ఎక్కువ నిరోధకత కలిగిన కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా
అరటికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి. అలాగే ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. ఈ అరటికాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. ఈ బయోయాక్టివ్ సమ్మేళనాలు మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
అరటికాయ ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవి కడుపును తొందరగా నింపుతాయి. దీంతో మీరు రోజులో కేలరీలను తక్కువగా తీసుకుంటారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అరటికాయలను ఇలా : ఫ్రైస్, కర్రీ, చిప్స్ లా అరటికాయలను ఇష్టం వచ్చినట్టు వండుకుని తినొచ్చు. అయినప్పటికీ అరటికాయలను తినడం వల్ల దానిలో ఉండే పోషకాలు మారవని గుర్తుంచుకోండి.