వేడి వేడి నీళ్లతో తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?
వేడి నీటితో తలస్నానం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో లేదా శరీరం అలిసిపోయినపుడు వేడినీటితో స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటితో తలస్నానం చేయడం మంచిదా? కాదా? దానివల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వేడి నీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు
వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల తాత్కాలికంగా హాయిగా ఫీల్ అవుతాం. వేడి నీళ్లు తల మీద పోసినపుడు తలపై చర్మంలోని నరాలు రిలాక్స్ అవుతాయి. దానివల్ల కొంతమందికి తలనొప్పి తగ్గుతుంది. అంతేకాదు వేడి నీటితో తలస్నానం చేసినపుడు తలపై ఉండే దుమ్ము, ధూళి, వాపు, జిడ్డు వంటి వాటిని త్వరగా తొలగించవచ్చు. దానివల్ల తల శుభ్రం అవుతుంది. తేలికగా, హాయిగా అనిపిస్తుంది.
వేడి నీటి స్నానం వల్ల కలిగే ఇబ్బందులు
వేడినీటి స్నానం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వేడి నీళ్లు తల చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. ఇది చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా జుట్టు సాఫ్ట్ గా ఉండేవాళ్లు వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వేడినీటిని తరచూ ఉపయోగిస్తే తలపై సహజ నూనె తొలగిపోతుంది. ఫలితంగా జుట్టు బలహీనపడుతుంది.
తలనొప్పి పెరగవచ్చు
వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల కొన్నిసార్లు తలనొప్పి పెరగవచ్చు. కొందరికి తాత్కాలికంగా బీపి తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. కొందరికి మతిమరుపు, అలసట, ఒత్తిడి కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల తల బరువుగా మారే అవకాశముంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తలస్నానానికి వేడి నీటిని వాడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువ వేడిగా ఉండకూడదు. అలాగే ముందు తలపై కొంచెం చల్లటి నీరు పోసుకున్న తర్వాత మాత్రమే వేడి నీటిని ఉపయోగించాలి. దానివల్ల తలపై చర్మం ఒక్కసారిగా వేడెక్కకుండా ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత తలని మృదువైన క్లాత్ తో తడి లేకుండా తుడుచుకోవాలి. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే స్టైల్ చేసుకోవాలి.
వారానికి 2- 3 సార్లు
వారానికి 2 నుంచి 3 సార్లు వేడి నీటితో తలస్నానం చేయడం మంచిది. రోజూ వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల తల చర్మం సహజ తేమ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దానికి బదులు నార్మల్ వాటర్ తో తలస్నానం చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.