కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకలను బలోపేతం చేసే ఆహార పదార్థాలు ఇవే..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. శరీరంలో దీని లోపం ఏర్పడితే శరీరంలో జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. మరి కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకలను బలోపేతం చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహార జీవనశైలిలోని మార్పుల కారణంగా శరీరానికి కావల్సిన పోషకాలు లభించకపోవడంతో కాల్షియం లోపం ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. శరీరంలో కాల్షియం లోపిస్తే కండరాల నొప్పులు, దంతాల ఆరోగ్యం క్షీణించడం, ఎముకలు బలహీనంగా మారడం, నీరసంగా అనిపించడం, చర్మ సమస్యలు ఏర్పడతాయి.
ఈ సమస్యలన్నీ మీలో కలిస్తే కాల్షియం లోపంగా పరిగణించాలి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి శరీరానికి కావల్సిన కాల్షియంను అందించాలి. ఇందుకోసం తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహార జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. అప్పుడే 60 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఎనర్జీగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
పాలు: పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు పాలను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. కనుక కాల్షియం లోపంతో బాధపడే వారు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలను తీసుకోవాలి. అలాగే సోయా మిల్క్, పెరుగు వంటి పదార్థాలలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
రాగులు: రాగులు శరీరానికి శక్తినిచ్చే మంచి పౌష్టికాహారం. నూరు గ్రాముల రాగులను తీసుకుంటే 300mg కాల్షియం లభిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అలాగే జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. కనుక రాగి సంగటి, రాగి జావ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
నువ్వులు: నువ్వులను తీసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుంటే సుమారు 88mg కాల్షియం శరీరానికి లభిస్తుంది. దీంతో వృద్ధాప్య వయసులో కూడా ఎముకలు, దంతాలు, నరాల బలహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కనుక శరీరానికి నువ్వులను ఏదో విధంగా అందించడం ముఖ్యం.
గుడ్డు: ఉడికించిన గుడ్డులో వివిధ రకాల విటమిన్లు, ప్రొటీన్లు లతోపాటు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లును తీసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి మీ రోజువారీ ఆహార జీవనశైలిలో గుడ్డును చేర్చుకోండి.
చేపలు: సాల్మన్ వంటి వివిధ రకాల కొవ్వు చేపలలో అనేక విటమిన్లు, ప్రొటీన్లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు కావలసిన కాల్షియంను అందించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనక వారంలో రెండు మూడు సార్లు చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమిన్ కె, కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. కనుక అన్ని రకాల పండ్లు, కూరగాయలతో పాటు ఆకుకూరలను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉండి వృద్ధాప్యంలో కూడా ఎటువంటి నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
వీటితో పాటు కివి, క్యాబేజీ, సోయాబీన్స్, బ్రోకలీ, బెండ కాయలు, చిలగడదుంప, పొద్దుతిరుగుడు గింజలు, ఆరెంజ్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కాల్షియం లోపం తగ్గి ఎముకలు ఆరోగ్యంగా, బలంగా మారుతాయి.