పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? ఇవి తింటే అంతా సెట్
ప్రస్తుతం చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్. లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాలతో ఈ సమస్య ఎదురవుతుంది. మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవడం ద్వారా నెలసరి సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మహిళల్లో నెలసరి సమస్యలు ఎక్కువయ్యాయి. ఇరెగ్యులర్ పీరియడ్స్ సర్వసాధారణం అయిపోయాయి. మాములుగా మహిళలకు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. అవి సరైన సమయానికి రాకపోవడమే ఇరెగ్యులర్ పీరియడ్స్. చాలా తక్కువ మందికే టైం టు టైం పీరియడ్స్ వస్తాయి. కొంతమంది స్త్రీలకు నెలసరి రెండు నెలలకు ఒకసారి వస్తే.. మరికొందరికి రెండు, మూడు నెలలైనా రాదు.
కారణాలు ఇవే
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత లాంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని పరిష్కరించడానికి చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అన్నింటికి మందులు వాడితే.. మరో కొత్త సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సహజంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం.
ఇవి తింటే మేలు
బొప్పాయి:
బొప్పాయి తింటే నెలసరి సరిగ్గా వస్తుందని అందరికీ తెలిసిందే. ముందుగానే పీరియడ్స్ రావడానికి ఇది ఉత్తమ ఎంపిక. బాగా పండిన బొప్పాయిని రోజుకు రెండుసార్లు తినండి. దాన్ని మీరు పండుగా లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు.
అల్లం:
అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సాయపడుతుంది. అల్లంను టీలో గాని తేనెలో గాని కలిపి తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే నెలసరి సరిగ్గా వస్తుంది.
వీటిని ట్రై చేయండి
దానిమ్మ:
పీరియడ్స్ సరిగ్గా రావడానికి దానిమ్మ పండు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దానిమ్మ పండును దాని తెల్లటి పొరతో పాటు తింటే మంచిది. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది. పీరియడ్స్ రాకముందు అంటే, 10-15 రోజుల ముందు రోజుకు మూడుసార్లు దానిమ్మ పండు తింటే నెలసరి సరిగ్గా వస్తుంది.
కలబంద:
కలబంద చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది శరీర వేడిని తగ్గించడంలో సాయపడుతుంది. సాధారణంగా కలబందను చర్మ సంరక్షణ, జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తాము. కానీ కలబంద నెలసరి సమస్యను కూడా పరిష్కరిస్తుంది. దీని కోసం కొద్దిగా కలబంద జెల్‌తో ఒక చెంచా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం భోజనం చేయడానికి ముందు తీసుకుంటే నెలసరి సమస్య తగ్గిపోతుంది.
వీటితో మేలు
విటమిన్ సి:
విటమిన్ సి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. నెలసరి సరిగ్గా రావడాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి.
నువ్వులు:
నువ్వులు నెలసరి త్వరగా రావడానికి ప్రేరేపిస్తాయని మనందరికీ తెలుసు. కానీ అవి వేడి స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి అధికంగా కాకుండా మితంగా మాత్రమే తినండి. ఇవి కాకుండా మెంతులు, సోంపు, జీలకర్ర, కొత్తిమీర గింజలు, సెలెరీ వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు.