జాగ్రత్త.. ఈ వ్యాధి సోకితే గుండెపోటు వచ్చే ప్రమాదముంది
ప్రస్తుతం కొవ్వు కాలెయ వ్యాధి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ వ్యాధి మొదటి దశలో ఎలాంటి హాని కలిగించదు. కానీ ఈ సమస్య పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

fatty liver
ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కేలరీలను ఎక్కువగా తీసుకోవడం, డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్, ఆల్కహాల్ వల్ల కాలెయంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. కొంతమందిలో కాలెయంలోని కొవ్వు వల్ల కణాలు దెబ్బతింటాయి. అలాగే వాపునకు గురవుతాయి. అది లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రారంభ దశలో కొవ్వు కాలేయ వ్యాధి పెద్దగా హాని కలిగించదు. అయితే చాలా మంది ఈ వ్యాధిని ముదిరినంకనే గుర్తిస్తారు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది కాలేయం పనిచేయకపోవడం, కాలేయ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ తో పాటుగా హృదయ సంబంధ వ్యాధులను కూడా కలిగిస్తుంది.
fatty liver
మీ కాలేయం పనిచేయాల్సిన విధంగా పనిచేయకపోతే గుండె ఆరోగ్యాన్ని రక్షించే అవసరమైన కొవ్వులు, ముఖ్యమైన ప్రోటీన్లను సరిగ్గా జీవక్రియ చేయలేకపోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాలేయ సమస్యలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాలేయ వ్యాధికి, గుండెజబ్బులకు మధ్య కచ్చితమైన, స్పష్టమైన సంబంధం ఉందంటున్నారు నిపుణులు. కొవ్వు కాలేయ వ్యాధి, గుండె జబ్బులకు ప్రమాద కారకాలు సమానంగా ఉంటాయి. అందుకే దీర్ఘకాలిక కాలేయ సిరోసిస్ ఉన్నవారి కంటే కొవ్వు కాలేయం ఉన్నవారు గుండెపోటుతో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాలేయ సిరోసిస్ ఉన్న రోగులకు గుండె ఆగిపోవడం, గుండెకొట్టుకోవడంలో తేడాలు, ఆకస్మిక గుండె మరణం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
heart attack
కార్డియాక్ అరెస్ట్ ఉన్న రోగులకు కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాలేయానికి తగినంత రక్త ప్రవాహం అందకపోవడం వల్ల తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ లో కాలేయానికి నష్టం సంభవిస్తుంది. దీన్నే కార్డియోజెనిక్ అంటారు. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మీకు గుండె జబ్బులు రావొద్దంటే ఈ సమస్య రాకుండా చూసుకోవాలి. లేదా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి.