బీర్ తాగితే నిజంగా కిడ్నీ స్టోన్స్ కరుగుతాయా?
ప్రస్తుత కాలంలో కిడ్నీ స్టోన్ సర్వ సాధారణ సమస్యగా మారింది. చెడు ఆహారాలను తినడం, మారుతున్న జీవన శైలే ఇందుకు ప్రధాన కారణమంటారు నిపుణులు. ఈ సమస్య వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. అయితే ఈ సమస్యపై చాలా మంది ఎన్నో అపోహలను నమ్ముతున్నారు. మరి వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హెల్తీ ఫుడ్ ను తినకపోవడం, వేగంగా మారిపోతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో కిడ్నీ స్టోన్స్ ఒకటి. ఇది ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. నిజానికి ఇది ఎంతో నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది కూడా ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాలలో పేరుకుపోయిన స్ఫటిక పదార్థం. ఇది మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, ఇతర పదార్ధాలు పెరగడం వల్ల సంభవిస్తుంది.
kidney stone
ఈ పదార్థాలన్నీ రాళ్లుగా మారుతాయి. ఈ రాళ్లను సరైన సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయించుకుంటే దీని నుంచి తొందరగా బయటపడతారు. అయితే ఈ కాలంలో కూడా కిడ్నీ స్టోన్స్ గురించి ఎన్నో అపోహలను నమ్ముతున్నారు. ఈ అపోహలే కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ ను మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్నాయి. అందుకే మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధించిన కొన్ని సాధారణ అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
kidney stone
అపోహ 1: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు పాలు లేదా పాల ఉత్పత్తులను తినొద్దు
వాస్తవం: కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు పాలు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని చాలా మంది నమ్ముతుంటారు. దీన్ని ఫాలో కూడా అవుతారు. అయితే దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు. పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం ఎన్నో శారీరక పనులకు అవసరం. కాల్షియం లోపం ఉన్నా.. కాల్షియం మరీ ఎక్కువగా ఉన్నా మీ కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి.
kidney stone
అపోహ 2: మందులు రాళ్ల పరిమాణాన్ని తగ్గిస్తాయి
వాస్తవం: మూత్రపిండాల్లో ఉన్న కొన్ని రాళ్లు మందులతో కరిగిపోతాయి. కానీ ఇది కేవలం 10% కేసులలో మాత్రమే జరుగుతుంది. అందుకే మందులు రాళ్ల పరిమాణాన్ని తగ్గిస్తాయని చెప్పడంలో నిజం లేదు. ఎందుకంటే మందుకు రాళ్ల నిర్మాణం, పరిమాణం, ప్రతిస్పందన మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
kidney health
అపోహ 3: శస్త్రచికిత్స తర్వాత మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ ఏర్పడతాయి
వాస్తవం- శస్త్రచికిత్స ద్వారా లేదా మందులతో రాళ్లను తొలగించినప్పటికీ.. మూత్రపిండాల్లో రాళ్ళు పునరావృతమయ్యే అవకాశాలు 50% ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
Image: Getty
అపోహ 4: మూత్రపిండాల్లో రాళ్లకు బీర్ ఉపయోగపడుతుంది
నిజం- మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి బీర్ సహాయపడుతుందని చాలా మంది చెప్పడం వినే ఉంటారు. కానీ ఈ విషయంలో ఇంత కూడా నిజం లేదు. బీర్ లో నీళ్లు మాత్రమే కాదు ఆల్కహాల్ కూడా ఉంటుంది. ఇది గ్యాస్ట్రైటిస్, కాలేయం దెబ్బతినడానికి కారణమవుతుంది.
అపోహ 5: కిడ్నీ స్టోన్, గాల్ బ్లాడర్ స్టోన్ రెండూ ఒకటే
వాస్తవం: మూత్రపిండాల్లో రాళ్లు, పిత్తాశయ రాళ్లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అలాగే ఈ రెండూ వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. పిత్తాశయం రాళ్లు ఉదరం ఎగువ కుడి భాగంలో నొప్పిని కలిగిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు నడుములో భరించలేని నొప్పిని కలిగిస్తాయి.