మీకు కీళ్ల నొప్పులున్నాయా? అయితే వీటిని అస్సలు తినకండి.. తిన్నారో..!
కీళ్లలో ఉన్నట్టుండి విపరీతమైన నొప్పి వస్తుందా? మీరు ఈ ఆహారాలను తింటున్నారా? అయితే ఇప్పటినుంచే వాటిని తినడం మానేయండి. ఎందుకంటే ఇవి కీళ్ల నొప్పులను పెంచుతాయి.
Arthritis
ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి వల్ల కీళ్లు వాపు వచ్చి భరించలేని నొప్పి వస్తుంది. ఈ వ్యాధి పెరిగి మీ కీళ్లను పూర్తిగా చుట్టుముడుతుంది. ఒకప్పుడు ఈ వ్యాధి వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న వయస్సు వారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు. కానీ కొన్ని చిట్కాలతో మంటను, నొప్పిని తగ్గించొచ్చు. వ్యాయామం, ఆహార నియంత్రణ, బరువు నిర్వహణ మొదలైనవి ఆర్థరైటిస్ నొప్పిని నియంత్రించడానికి సహాయపడతాయి. అయితే ఆర్థరైటిస్ రోగులు కొన్ని ఆహారాలను మొత్తమే తినకూడదు. ఎందుకంటే ఇవి కీళ్ల నొప్పులను బాగా పెంచుతాయి. అవేంటంటే..
చక్కెర కలిగిన ఆహారాలు
చక్కెర ఒక్క ఆర్థరైటిస్ రోగులకే కాదు ఎవ్వరికీ అంత మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే డయాబెటీస్ నుంచి బరువు పెరగడం వరకు ఎన్నో రోగాలు వస్తాయి. మీరు ఆర్థరైటిస్ పేషెంట్ అయితే అదనపు చక్కెర ఉన్న ఆహారాన్ని మొత్తమే తినకండి. సోడా, ఐస్ క్రీం, మిఠాయి, సాస్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. చక్కెర పానీయాలు, ఆహారాలు ఇచ్చిన ఆర్థరైటిస్ రోగులకు కీళ్ల నొప్పులు ఎక్కువైనట్టు కనుగొన్నారు. అలాగే ఆర్థరైటిస్ ఇతర లక్షణాలు కూడా పెరిగాయని కనుగొన్నారు.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఆర్థరైటిస్ లక్షణాలను పెంచుతుంది. ఎవరికైనా తాపజనక ఆర్థరైటిస్ ఉంటే వారు ఆల్కహాల్ ను మొత్తమే మానేయాలి. అంతేకాదు ఆల్కహాల్ గౌట్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనంలో.. ఆర్థరైటిస్ ఉన్న రోగులను 4 నుంచి 6 వారాల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలని చెప్పారు. దీనివల్ల వారికి కీళ్ల నొప్పుల నుంచి చాలా ఉపశమనం కలిగిందని అధ్యయనం కనుగొంది.
గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
గ్లూటెన్ అనేది గోధుమ, బార్లీ మొదలైన వాటిలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మంటను పెంచుతాయి. అలాగే ఆర్థరైటిస్ పేషెంట్ల కీళ్ల నొప్పులను పెంచుతాయి.
వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం
వేయించిన మాంసాలు, స్తంభింపచేసిన ఆహారాలు కీళ్ల నొప్పులను కలిగిస్తాయి. కాల్చిన, ప్యాక్ చేసిన స్నాక్స్ కూడా ప్రాసెస్ చేయబడతాయి. మీరు ఆర్థరైటిస్ పేషెంట్ అయితే వీటిని మొత్తమే తినకండి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. ఈ ఆహారాలను తినకపోతే మంట తగ్గుతుంది. మీ పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆర్థరైటిస్ ను మాత్రమే కాకుండా ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఎర్ర మాంసం
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎర్ర మాంసంలో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల వాటిలో అనేక ఇతర హానికరమైన సమ్మేళనాల పరిమాణం కూడా పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. కీళ్ల నొప్పులు వస్తాయి.