ఉదయాన్నే ఇవి తింటున్నారా? అయితే బరువు తగ్గడం కష్టం
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. కారణాలేవైనా బరువు మాత్రం దానికి నచ్చినట్లు పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. అయితే శరీర బరువును ఈజీగా ఎలా తగ్గించుకోవాలి? నాజుకైన శరీరం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మరీ ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినకూడదు? లాంటి విషయాలు ఇక్కడ చూద్దాం.

ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఏదో విధంగా బరువు తగ్గించుకుని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. అందుకోసం రకరకాల డైట్‌లను ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల బరువు తగ్గక పోగా మరింత పెరుగుతున్నారు.
బరువు అదుపులో..
అధిక బరువు వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల కలిగే దుష్ప్రభావాలు అన్ని వయసుల వారిలోనూ ఉంటున్నాయి. బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఆహార నియంత్రణ చాలా అవసరం. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు.
బ్రేక్ ఫాస్ట్ ఎందుకు ముఖ్యం?
బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉదయం కొన్ని ఆహారాలు తినడం మానేయాలి.
ఇవి తినవద్దు
నూనె పదార్థాలు:
బ్రేక్ ఫాస్ట్ లో పూరి, వడ, సమోసా, బజ్జీ వంటి నూనె పదార్థాలు ఉండకూడదు. వాటిలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బదులు పెరిగే అవకాశం ఉంటుంది.
వైట్ బ్రెడ్:
చాలా మంది వైట్ బ్రెడ్‌నే అల్పాహారంగా తీసుకుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటిలో అధిక శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇది కొవ్వును శరీరంలో నిల్వ చేసి, బరువు పెరగడానికి కారణమవుతాయి. వీలైతే వైట్ బ్రెడ్‌కు బదులు బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిది. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి.
ఇవి హాని చేస్తాయి!
తెల్ల బియ్యం:
బియ్యం ధాన్యం అయినప్పటికీ, దానిలోని ఫైబర్ పూర్తిగా తొలగించబడుతుంది. కార్బోహైడ్రేట్‌లు మాత్రమే అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించదు. తెల్ల బియ్యం బదులు బ్రౌన్ బియ్యం తినడ ఉత్తమం. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సాయపడుతాయి.
ప్యాక్ చేసిన జ్యూస్:
ఉదయం ప్యాక్ చేసిన జ్యూస్ తాగితే, అది ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులు హాని చేస్తుంది. ముఖ్యంగా ఈ జ్యూస్ బరువును పెంచుతుంది. కాబట్టి దానికి బదులు ఇంట్లో తయారుచేసిన జ్యూస్ తాగడం మంచిది.
చాక్లెట్:
కొంతమందికి ఉదయం లేవగానే చాక్లెట్ తినడం ఇష్టం. కానీ అలా తింటే బరువు పెరగడం ఖాయం. చాక్లెట్‌లో ఉండే అధిక చక్కెర శరీరాన్ని లావుగా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే.. ఉదయం చాక్లెట్ తినికూడదు.