Strawberry Plant: స్ట్రాబెర్రీ మొక్కలను ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచాలో తెలుసా?
స్ట్రాబెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. మనం వీటిని ఎక్కువగా బయటే కొనుగోలు చేస్తుంటాం. కానీ స్ట్రాబెర్రీ మొక్కలను ఇంట్లోనో ఈజీగా పెంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం
స్ట్రాబెర్రీల్లో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినమని నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా మనం స్ట్రాబెర్రీలను బయట మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తుంటాం. మనం కావాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు అవి దొరకవు కూడా. అలాంటప్పుడు స్ట్రాబెర్రీ మొక్కలను ఇంట్లోనే పెంచుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా.. మరి ఆలస్యమెందుకు స్ట్రాబెర్రీ మొక్కలను ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచాలో ఓసారి చూసేయండి.
ఎక్కడ పెంచాలంటే?
చల్లని, వెచ్చని వాతావరణంలో స్ట్రాబెర్రీ మొక్కలను పెంచుకోవచ్చు. నేల, గ్రో బ్యాగ్, కుండీలలో వీటిని పెంచుకోవచ్చు. ఇంట్లో స్ట్రాబెర్రీలు పెంచాలంటే వీటికి సరిపడా వెలుతురు ఉండాలి. రోజుకు కనీసం 6 గంటల సూర్యరశ్మి అవసరం. కాబట్టి బాల్కనీ, టెర్రేస్ లేదా విండో పక్కన వీటిని పెంచుకోవచ్చు.
మొక్కలు ఎలా నాటాలంటే?
స్ట్రాబెర్రీ మొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు. లేదా స్ట్రాబెర్రీ నుంచి విత్తనాలను జాగ్రత్తగా సేకరించి మొక్కలను పెంచుకోవచ్చు. మొక్క వేర్లు మట్టిలోపలికి వెళ్లేలా నాటుకోవాలి. నాటిన తర్వాత తక్కువగా నీళ్లు పోయాలి. మట్టి తడిగా ఉండాలి గానీ నీరు నిల్వ ఉండకూడదు. రోజుకు ఒకసారి తెల్లవారుజామున లేదా సాయంత్రం నీరు పోయాలి.
తెగుళ్ల నుంచి రక్షణ కోసం..
మొక్కల మధ్య తగినంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. మొక్కకు సూర్యరశ్మి అవసరం అయినప్పటికీ, ప్రత్యక్ష ఎండ తగలకూడదు. తెగుళ్ల నుంచి రక్షణ కోసం వేప నూనెను వాడవచ్చు. వాడిపోయిన ఆకులను వెంటనే తొలగించాలి. నెలకు ఒకసారి సేంద్రియ ఎరువులు వాడాలి. మొక్కలకు పూలు వచ్చిన తర్వాత కొన్ని వారాల్లో పండ్లు వస్తాయి. పండ్లు ఎర్రగా మారినప్పుడు కోసుకోవాలి.
3 నుంచి 4 నెలల తర్వాత
సాధారణంగా మొక్కలు నాటిన 3–4 నెలల తర్వాత పండ్లు రావడం ప్రారంభమవుతుంది. ఒకసారి మొక్కలు పండితే, మరిన్ని కొత్త మొక్కలు కూడా వస్తాయి. వీటిని తీసి మళ్లీ కొత్తగా నాటుకోవచ్చు. ఇంట్లోనే స్ట్రాబెర్రీ మొక్కలను పెంచడం ద్వారా తాజా పండ్లను పొందవచ్చు. ఇది మంచి అలవాటు మాత్రమే కాదు.. దానివల్ల మనసుకు ప్రశాంతత కూడా దక్కుతుంది.