- Home
- Technology
- Gadgets
- Samsung Galaxy F70 5G: అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరలోనే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్
Samsung Galaxy F70 5G: అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరలోనే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్
Samsung Galaxy F70 5G: శాంసంగ్ భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరకు ప్రీమియం ఫీచర్లను అందిస్తూ సరికొత్త 'శాంసంగ్ గెలాక్సీ F70 5G' ఫోన్‌ను లాంచ్ చేసింది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఫోటోగ్రఫీ కోసం 50MP OIS కెమెరా వంటి ఫీచర్లను అందిస్తోంది.

రూ. 20 వేలలోపే అదరగొట్టే శాంసంగ్ 5G ఫోన్.. విక్టస్ గ్లాస్, OIS కెమెరా వేరే లెవెల్
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ 5G ఫోన్లకు ఎప్పుడూ భలే డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ ఎఫ్ సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే ‘శాంసంగ్ గెలాక్సీ F70 5G’. రూ.20,000 కన్నా తక్కువ ధరల విభాగంలోనే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న 50 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించడం విశేషం.
శాంసంగ్ గెలాక్సీ F70 5G ధర, వేరియంట్లు, బ్యాంక్ ఆఫర్లు
శాంసంగ్ గెలాక్సీ F70 5G భారతదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB రామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ సాధారణ ధర రూ. 19,999 కాగా, 6GB రామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999 గా నిర్ణయించారు.
ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ లో కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో బేస్ వేరియంట్‌ను రూ. 17,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లైలాక్ బ్లిస్, బ్లిస్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్ వివరాలు ఇవే
శాంసంగ్ గెలాక్సీ F70 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హచ్ డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా రూ.20,000 లోపు ఉండే ఫోన్లలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ చూడటం చాలా అరుదు, కానీ ఈ ఫోన్‌లో ఆ ప్రొటెక్షన్‌ను శాంసంగ్ అందించింది. ఇది స్క్రాచెస్, ఫోన్ కిందపడినా తట్టుకునేలా రక్షణ ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 7.5 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీని బరువు దాదాపు 192 గ్రాములు. దుమ్ము, ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ కోసం ఇది ఐపీ54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
ప్రాసెసర్, స్టోరేజ్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వివరాలు ఇవే
ఈ ఫోన్ లో శాంసంగ్ సొంత 5nm ప్రాసెస్ ఆధారిత ఆక్టా-కోర్ ‘ఎక్సినోస్ 1330’ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 2.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. స్టోరేజ్ పెంచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది, దీని ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పై పనిచేస్తుంది. ఈ విభాగాంలో మరే ఇతర బ్రాండ్ ఇవ్వని విధంగా, శాంసంగ్ ఈ ఫోన్‌కు 4 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. దీనితో పాటు శాంసంగ్ నాక్స్, శాంసంగ్ వాలెట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కెమెరా, సూపర్ బ్యాటరీ సామర్థ్యం
ఫోటోగ్రఫీ కోసం గెలాక్సీ F70 5G లో వెనుక వైపు త్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరా, 5MP ఆల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం వల్ల బ్లర్ లేని స్పష్టమైన ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మార్కెట్లో పోటీ.. వేరియంట్ల పోలిక
శాంసంగ్ F-సిరీస్‌లో F70e 5G రూ. 18,499 నుండి ప్రారంభ ధరలో మార్కట్ లోకి వచ్చింది. అలాగే, F70 Pro 5G రూ. 37,999 నుండి ప్రారంభ ధరలో శాంసంగ్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ మోడళ్ల మధ్యలో F70 5G చేరుతుంది. బ్రాండ్, మంచి డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
మార్కెట్‌లో దీనికి నేరుగా 'వన్ ప్లస్ N6x' సవాలు విసురుతోంది. వన్ ప్లస్ N6x లో 7,000mAh పెద్ద బ్యాటరీ, 120Hz HD+ LCD డిస్‌ప్లే ఉన్నప్పటికీ, శాంసంగ్ F70 5G మెరుగైన Full HD+ AMOLED డిస్‌ప్లే, OIS కెమెరా, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఎక్కువ కాలం వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ముందంజలో నిలుస్తుంది.

