వెజిటేబుల్ ఇడ్లీలను ఎలా చేయాలి?
ఇడ్లీలు మంచి బ్రేక్ ఫాస్ట్. ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. అయితే రొటీన్ గా కాకుండా మీరు ఇడ్లీలను మరింత డిఫరెంట్ గా, టేస్టీగా తినొచ్చు. అది కూడా రకరకాల కూరగాయల్తో. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ, పూరీ, చపాతీ, ఉప్మా వంటివి తింటుంటాం. రోజూ ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ ను అయితే ఖచ్చితంగా తింటాం. నిజానికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా చేయాలని చెప్తారు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అయితే చాలా మంది తొందరగా జీర్ణమవుతుందని, ఆరోగ్యానికి మంచిదని ఇడ్లీలను ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ ఇడ్లీలను రొటీన్ గా కాకుండా మీరు మరింత టేస్టీగా చేసుకుని తినొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మీ ఇంట్లో ఉన్న రకరకాల కూరగాయల్తో ఇడ్లీలను తయారుచేయడమే.
నిజానికి వెజిటేబుల్ ఇడ్లీలు చూడటానికి బాగా అనిపించడమే కాకుండా.. మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను కూడా అందిస్తాయి. అందుకే ఈ వెజిటేబుల్ ఇడ్లీలను ఎలా సులువుగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెజిటేబుల్ ఇడ్లీలను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
రవ్వ - 1/2 కప్పు, పెరుగు - 2 కప్పులు, సన్నగా తురిమిన క్యారెట్ - 1/2 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు - ఒకటి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి - 2-3, సన్నగా తరిగిన బీన్స్ - 1/2 కప్పు, పచ్చి బఠానీలు - 1/2 కప్పు, ధనియాల పొడి - అర టీ స్పూను, నల్ల మిరియాల పొడి - 1/4 టీస్పూన్, జీలకర్ర - 1 టీ స్పూను, ఆవాలు - 1/2 టీస్పూన్, మినప్పప్పు - 1 టీ స్పూను, శనగపప్పు - 1 టీ స్పూన్, నూనె - 3-4 టీస్పూన్లు, రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా.
వెజిటేబుల్ ఇడ్లీలు ఎలా తయారుచేయాలి?
స్టెప్ 1: వెజిటేబుల్ ఇడ్లీని తయారుచేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఇడ్లీ రవ్వ, పెరుగు, నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా తయారుచేయండి. పిండి గిన్నెపై నిండా మూత పెట్టి 15-20 నిమిషాల పక్కన పెట్టండి. దీంతో రవ్వ బాగా ఉబ్బుతుంది.
స్టెప్-2: ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణలీ పెట్టుకుని అందులో 2 టీస్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత పైన చెప్పిన కూరగాయల్నీ దీంట్లో వేయండి.
స్టెప్-3: కూరగాయలు వేగిన తర్వాత దాంట్లో ఉప్పు ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించుకోండి.
స్టెప్- 4: ఈ కూరగాయల్నీ మెత్త బడిన తర్వాత వీటిని తీసి ఉబ్బిన ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపండి. అవసరమనుకుంటే ఈ పిండిలో మీరు నీళ్లను కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత పిండిలో కొంచెం బేకింగ్ సోడాను వేసి బాగా కలపండి.
స్టెప్-5: అంతే ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకుని ఇడ్లీలను వేయండి. అంతే టేస్టీ టేస్టీ వెజిటేబుల్ ఇడ్లీలు రెడీ అయినట్టే. ఎంతో ఈజీ కదా. ఇవి రోటీన్ ఇడ్లీలకు బదులుగా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. పిల్లల టిఫిన్ లోకి ఇవి చాలా బాగుంటాయి. వీటిని తింటే మీరు బరువు కూడా తగ్గుతారు.