టేస్టీగా ఉందని ఊరగాయను ఎక్కువగా తినేయకండి.. ఈ సమస్యలొస్తయ్..
ఊరగాయను రెగ్యులర్ గా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అవును ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉప్పు, నూనెను ఎక్కువగా కలుపుతారు. ఇది మీ రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతుంది. దీంతో మీకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి.
ఉసిరికాయ పచ్చడి, మామిడి పచ్చడి, నిమ్మకాయ, క్యాబేజీ, క్యారెట్, ముల్లంగి కాకరకాయ పచ్చడిలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది కాలాలతో సంబంధం లేకుండా వీటిని పెడుతూనే ఉంటారు. ప్రతి రోజూ తింటూనే ఉంటారు. ఎలాంటి కూర చేసినా.. ప్లేట్ లో ఓ పక్క ఏదైనా ఒక ఊరగాయ ముక్క ఉండాల్సిందే. ఏ కూరతో ఊరగాయను కలుపుకుని తిన్నా చాలా టేస్టీ ఉంటుంది. అందుకే చాలా మంది ఊరగాయలను రెగ్యులర్ గా తింటుంటారు. కానీ వీటిని మరీ ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఊరగాయను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ పోషకాలు
ఊరగాయ ప్రక్రియ వాటిలోనే పోషకాలన్నింటిని తగ్గించేస్తుంది. ఎలా అంటే ఊరగాయ పెట్టాలంటే పండ్లను లేదా కూరగాయలను కోసి ఎండలో ఆరబెట్టాల్సి వస్తది. వీటిలోని నీరంతా పోయే దాక ఎండబెడతారు. అయితే వీటిని ఎండలో ఆరబెట్టడం వల్ల చాలా పోషకాలు నశిస్తాయి. అంతేకాకుండా ఎండబెట్టే ముందు వీటికి ఉప్పును కూడా కలుపుతారు.
సోడియం రక్తపోటును పెంచుతుంది
ఊరగాయల్లో సాధారణంగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తపోటు అమాంతం పెరుగుతుంది. ఊరగాయ తినడం వల్ల చనిపోయే అవకాశం లేదు. కానీ క్రమం తప్పకుండా సోడియం క్లోరైడ్ ను తీసుకునే అలవాటు అధిక రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
మూత్రపిండాల ఆరోగ్యం ప్రభావితం
మీడియం సైజు మామిడి ఊరగాయలో 569 మిల్లీగ్రాముల సోడియం కంటెంట్ ఉంటుంది. రోజువారీ అవసరం 2,300 మి.గ్రా. పచ్చళ్లలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో మన ఆహారంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది శరీరంలో నీటి నిలుపుదల, కడుపు ఉబ్బరం, అధిక రక్తపోటు, మూత్రపిండాలపై పనిబారం పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అధిక ఉప్పు ఆహారం కాల్షియం శోషణను కూడా తగ్గిస్తుంది. దీంతో మీ ఎముకల సాంద్రత తగ్గుతుంది.
అధిక కొలెస్ట్రాల్
కూరగాయలను నూనెలో బాగా వేయించి ఊరగాయను తయారుచేస్తారు. దీనివల్ల కూరగాయలో వాటర్ కంటెంట్ ఉండదు. దీంతో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఈ నూనె మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె జబ్బులను కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మన కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఊరగాయల్లో వాడే నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది హైడ్రోజనేషన్ వల్ల వస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఊరగాయల షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది. కానీ మన శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే మంచి అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇవి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా పెంచుతాయి.