డయాబెటీస్ ఉన్నవారు అరటిపండ్లను తినొచ్చా?
అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అయితే కొంతమంది డయాబెటీస్ ఉన్నవారు అరటిపండ్లను తినకూడదని చెప్తుంటారు. దీనిలో నిజమెంతంటే?
డయాబెటిస్ జీవనశైలి వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే తగ్గే అవకాశమే ఉండదు. ఈ వ్యాధిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచకపోతే దీనిమూలంగా ఎన్నో వ్యాధులు వస్తాయి.
షుగర్ వ్యాధి గుండె, మూత్రపిండాలు, కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిని పెంచే పరిస్థితి. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
తీపి ఆహారాలను నివారించేటప్పుడు లేదా నియంత్రించేటప్పుడు చాలా మందికి ఉన్న సందేహాలలో ఒకటి పండ్లను కూడా తినొద్దా అనేది. అయితే చాలా పండ్లు సహజంగా తీయగా ఉంటాయి. అందుకే మధుమేహులు మరీ ఎక్కువ తీయగా ఉన్న పండ్లను తగ్గించాలి లేదా మొత్తమే తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అరటిపండు కూడా తీయగా ఉంటుంది. మరి దీన్ని కూడా మధుమేహులు తినకూడదా? అన్న డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?
banana
నిజానికి అరటిపండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అరటిపండ్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ బి 6, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అరటిపండు గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యంతో పాటుగా మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా అరటిపండ్లు తినొచ్చు. ఎందుకంటే అరటిపండ్లను తింటే మీరు ఇతర చెడు ఆహారాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అలాగే అతిగా తినకుండా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు అరటిపండ్లు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచే అవకాశముంది. అరటి పండ్లను ఇతర సమయాల్లో తినొచ్చు.
అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను మితంగా మాత్రమే తినాలి. డయాబెటిస్ ఉన్నవారు తీపి ఏదైనా తినాలనుకుంటే ధైర్యంగా ఎంచుకునే ఆహారం అరటిపండ్లు. అరటిపండ్లను మితంగా తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు సూచించాయి. ముఖ్యంగా పండని అరటిపండ్లు టైప్ -2 డయాబెటిస్ ను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. బాగా పండిన అరటిపండ్లు తీయగా ఉంటాయి. అందుకే మధుమేహులు కొద్దిగా పండిన అరటిపండును మాత్రమే తినాలి.