Neer Dosa: పిండి పులియబెట్టకుండా దోశ ఎలా చేయాలో తెలుసా?
కర్ణాటక ఫేమస్ నీర్ దోశ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? పిండి పులియబెట్టే పని లేకుండా.. సింపుల్ గా ఈ నీర్ దోశ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం...

మనందరికీ దోశ ఎలా తయారు చేయాలో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఉదయం లేస్తే.. ఇంట్లో ఎక్కువగా తినేది ఇడ్లీ, దోశలే. అయితే.. దోశ ను తయారు చేయాలంటే.. కనీసం 6, 7 గంటలు పప్పు, బియ్యం నానపెట్టాలి.. తర్వాత పిండిని పులియబెట్టాలి. కానీ.. పప్పు నానపెట్టే పని లేకుండా.. పిండి పులియబెట్టకుండా కూడా రుచికరమైన దోశ చేయవచ్చు. అదే నీర్ దోశ. ఇన్ స్టంట్ గా తయారు చేసుకునే ఈ దోశను ఎలా చేయాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...

నీర్ దోశ తయారీ
ఈ నీర్ దోశ తయారీకి మనం ఎలాంటి పప్పులు వాడాల్సిన అవసరం లేదు. బియ్యం, పచ్చి కొబ్బరీ ఉంటే చాలు. నానపెట్టిన బియ్యంలో పచ్చి కొబ్బరి వేసి.. మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో నీరు పోసి, ఉప్పు కలుపుకుంటే పిండి తయారైనట్లే. సాధారణ దోశెల కంటే నీర్ దోశెకి నీళ్ళు ఎక్కువ కావాలి. మిశ్రమం పలుచగా ఉండాలి. కావలసినన్ని నీళ్ళు పోయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పక్కన పెట్టి, తవ్వ వేడి చేసి, నూనె వేయాలి.
ఉల్లిపాయ ముక్కతో తవ్వకి నూనె రాస్తే దోశె బాగా వస్తుంది. ప్రతి దోశెకీ ముందు ఉల్లిపాయ ముక్కతో దోశ ప్యాన్ పై రుద్దాలి. అప్పుడు దోశలు ప్యాన్ కి అంటుకోకుండా చక్కగా వస్తాయి.
మిశ్రమం పోయడం
నీళ్ళు పైన, మిశ్రమం కింద ఉంటుంది. అందుకని, ప్రతి దోశెకీ ముందు రవ్వ దోశెలా మిశ్రమాన్ని కలపాలి. బాగా కలిపిన తర్వాతే దోశ వేసుకోవాలి. దోశ ప్యాన్ మీద మూత పెట్టి, రెండు నిమిషాలు ఆగితో దోశ రెడీ అవుతుంది. చాలా బాగా కాలుతాయి. ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి. ఒక్కవైపు కాలిస్తే సరిపోతుంది. రెండో పక్క తిప్పి కాల్చకూడదు.
దోశె సర్వింగ్
దోశెని మడవకుండా ప్లేట్‌లో పెట్టాలి. తిప్పకూడదు. వేడిగా ఉన్నప్పుడే మడిస్తే అంటుకుంటుంది. అలాగే ప్లేట్‌లో పెట్టాలి. కొబ్బరి చట్నీ ఈ దోశెకి బాగుంటుంది.