ఇవి తింటే.. మీ ఆయుష్షు తగ్గినట్లే..!
మనకు ఇష్టమైన ఫుడ్స్ ఈ ప్రపంచంలో చాలానే ఉండొచ్చు. అలా మనకు నచ్చే ఫుడ్స్ లో ఆరోగ్యకరమైన వాటితో పాటు, అనారోగ్యకరమైనవీ ఉంటాయి. అవి కొన్ని మన ఆయుష్షు పెంచితే, మరి కొన్ని ఆయుష్షు తగ్గించేస్తాయి. మరి, అవేంటో చూసేద్దామా...
ఈ రోజుల్లో బయటి ఆహారం, ముఖ్యంగా జంక్ ఫుడ్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. రుచిగా ఉండటంతో.. అలాంటి ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ, ఈ జంక్ ఫుడ్స్ కారణంగా అలసట, బలహీనత, రక్త హీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. చాలా మందికి డయాబెటీస్, ఉబకాయం, బీపీ, గుండె జబ్బులు, కొలిస్ట్రాల్, రక్తహీనత , విటమిన్ల లోపం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి.
తినడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వచ్చిన రోగాలకు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. 30-35 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసినా అలసిపోతున్నారు, లైంగిక సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యలకు మీరు తినే ఆహారమే కారణం అని ఎప్పుడైనా ఆలోచించారా? . గతంలో ఇంట్లో వండిన ఆహారం తినేవారు. అందుకే ఆరోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు చక్కెర, మైదా, నూనె, ఉప్పు ఎక్కువగా తింటున్నారు. బయట చేసే చాలా ఆహారాల్లో ఉప్పు, మైదా, షుగరే ఎక్కువగా ఉంటున్నాయి.
ఇవి శరీరాన్ని నెమ్మదిగా చంపేస్తున్నాయి. మీకు ఇష్టమైన కొన్ని ఆహారాలు మిమ్మల్ని బలహీనపరచడమే కాకుండా ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తున్నాయి. మరి, ఎలాంటి ఫుడ్స్ మీ ఆయుష్షును పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్యాక్ చేసిన స్నాక్స్-
ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది, ఇది బీపీని పెంచుతుంది. స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులకు దారితీస్తుంది. చిప్స్, కుకీస్, రెడీ టు ఈట్ ఫుడ్స్‌లో చక్కెర, కొవ్వు ఎక్కువ. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం, పోషకాహార లోపానికి దారితీస్తాయి. ఫలితంగా బలహీనత వచ్చేస్తుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్
కేక్‌లు, పేస్ట్రీలు, కుకీస్, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్, బర్గర్లు, బ్రెడ్ వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు, డయాబెటిస్‌కు దారితీస్తాయి. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ ప్రేవులను దెబ్బతీస్తాయి. ఊబకాయం, క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
రిఫైన్డ్ ధాన్యాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్
మైదా ఎక్కువగా వాడుతున్నారు. రొట్టెలు, పేస్ట్రీలు, పాస్తా, సమోసాలు వంటివి మైదాతో చేస్తారు. వీటిలో పోషకాలు, ఫైబర్ ఉండవు. రక్తంలో చక్కెర పెంచి, గుండెకు హాని చేస్తాయి.
ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, అక్రిలామైడ్ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్‌కు దారితీస్తాయి.
ప్రాసెస్డ్ మీట్
బేకన్, సాసేజ్, హాట్ డాగ్ వంటి వాటిలో నైట్రేట్స్, నైట్రైట్స్ ఉంటాయి. ఎక్కువ వేడి మీద వండడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి పెద్దప్రేగు క్యాన్సర్, బీపీ, గుండె జబ్బులకు దారితీస్తాయి.
సోడా, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లలో చక్కెర ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెర, ఊబకాయం, డయాబెటిస్‌కు దారితీస్తాయి. ఊబకాయం, కొవ్వు కాలేయం, గుండె జబ్బులకు దారితీస్తాయి.
మద్యం, BPA ఉన్న ప్యాక్ చేసిన ఆహారాలు...
ఎక్కువ మద్యం కాలేయం, గుండె, మెదడుకు హాని చేస్తుంది. కాలేయం వ్యాధులు, క్యాన్సర్, నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. కొన్ని టిన్ చేసిన ఆహారాల్లో BPA ఉంటుంది. ఇది ఆహారంలోకి చేరి ప్రేగులను దెబ్బతీస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం, క్యాన్సర్‌కు దారితీస్తుంది.