- Home
- Feature
- World's Shortest River : కేవలం 20 మీటర్లు ప్రవహించే నది.. ఈ భూమిపై అతి చిన్నదిదే, ఎక్కడుందో తెలుసా?
World's Shortest River : కేవలం 20 మీటర్లు ప్రవహించే నది.. ఈ భూమిపై అతి చిన్నదిదే, ఎక్కడుందో తెలుసా?
వందలు, వేల కిలోమీటర్లు ప్రవహించే నదుల గురించి తెలుసు. మరి కేవలం కొన్ని మీటర్లు మాత్రమే ప్రవహించి సముద్రంలో కలిసే అతి చిన్న నదులు కూడా ఈ భూమిపై ఉన్నాయని మీకు తెలుసా?

అతిచిన్న నదుల గురించి ఆసక్తికర విషయాలు..
ప్రపంచంలో అతి పొడవైన నది ఏది అనగానే టక్కున అమెజాన్ లేదా నైలు నది పేరు వినిపిస్తుంది. ఈ రెండు నదులు ఏకంగా 6 వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇండియాలో కూడా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు 2 నుండి 3 వేల కిలోమీటర్లు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి, కృష్ణా నదుల పొడవు 1000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. దీంతో వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తేనే నదులుగా పరిగణిస్తారని... చిన్నచిన్న ప్రవాహాలను వాగులు, కాలువలు అంటారనేది చాలామంది భావన. కానీ కొన్నిమీటర్ల నీటి ప్రవహాన్ని కూడా నదిగా పేర్కొనవచ్చు... ఇందుకు ఉదాహరణగా అనేక నదులున్నాయి.
ప్రపంచంలో అత్యంత పొడవైన, అధికంగా నీటిని మోసుకెళ్లే పెద్ద నదుల గురించి చాలామందికి తెలుసు. కానీ అత్యంత చిన్న నది ఏదో తెలుసా? కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ప్రవహించి సముద్రంలో కలిసే నదుల గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతి చిన్న నది ఇదే...
ప్రపంచంలోనే అతి చిన్న నది ఇండోనేషియాలో ఉంది. ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో తంబోరాసి నది కేవలం 20 మీటర్ల దూరం మాత్రమే ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ప్లోరెస్ సముద్ర తీరంలోని ఓ ఊట నుండి తంబోరాసి నది పుడుతుంది. ఊట నిండాక చిన్న ప్రవాహం సముద్రం దిశగా మొదలవుతుంది... చూస్తుండగానే సముద్రాన్ని చేరుతుంది. ఇలా అతి తక్కువ దూరం ప్రయాణించే నదిగా తంబోరాసి గుర్తింపు పొందింది.
ఈ నది ప్రత్యేకత దాని స్వచ్ఛమైన నీరు, సహజమైన పరిసరాలు. సున్నపురాయి కొండల సమీపంలోని నీటి ఊట నుంచి నీరు బయటకు వచ్చి చిన్న ప్రవాహంగా మారుతుంది. పచ్చని, నీలి ఛాయలతో కనిపించే నీరు పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ప్రపంచంలో అతిచిన్న నదులివే..
తంబోరాసి ఒక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చిన్నచిన్న నదులున్నాయి. సముద్ర తీరంలో పుట్టడం, కొన్నిమీటర్లు ప్రయాణించి సముద్ర జలాల్లో కలవడం వీటి స్పెషాలిటి. ఇలాంటి మరికొన్ని నదుల గురించి కూడా తెలుసుకుందాం.
రెప్రువా నది
జార్జియాకు సమీపంలోని అబ్ఖాజియా ప్రాంతంలో రెప్రువా నది కనిపిస్తుంది. ఇదికూడా ప్రపంచంలోని అతి చిన్న నదుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీని పొడవు సుమారు 27 మీటర్లు ఉంటుంది. ఈ నది ఒక భూగర్భ నీటి ఊట నుంచి బయటకు వచ్చి నల్ల సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, నీటి ప్రవాహం మాత్రం గణనీయంగా ఉంటుంది.
ఈ నదికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం నీటి ఉష్ణోగ్రత. దీనిలోని నీరు ఎప్పుడూ 10–11 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.. అంటే చల్లగా ఉంటుందన్నమాట. భూగర్భ జలాలు బయటకు వచ్చే విధానం, వాటి ప్రవాహం ఈ నదిని ప్రత్యేకంగా నిలబెడతాయి.
కొవాసెల్వా నది
నార్వేలోని హిట్రా ద్వీపంలో ఉన్న కొవాసెల్వా నది ప్రపంచంలోని అతి చిన్న నదుల్లో ఒకటిగా పేర్కొంటారు. దీని పొడవు సుమారు 22 మీటర్లు మాత్రమే. ఈ నది కొవాస్వత్నెట్ సరస్సు నుంచి ప్రారంభమై సముద్రంలో కలుస్తుంది. సరస్సు నుంచి బయటకు వచ్చిన నీరు కొద్దిదూరం మాత్రమే ప్రవహించినప్పటికీ, దానికి స్పష్టమైన ప్రవాహ మార్గం ఉంటుంది.
ఒంబ్లా నది
ఒంబ్లా నది క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్ సమీపంలో ఉంది. దీని ఉపరితల ప్రవాహం పొడవు సుమారు 30 మీటర్లు మాత్రమే. అయితే నీటి పరిమాణం పరంగా చూస్తే ఇది చాలా ప్రత్యేకమైన నది. ఈ నది భూగర్భ జలాల నుంచి ఏర్పడే కార్స్ట్ నీటి ఊట వద్ద ప్రారంభమవుతుంది. సున్నపురాయి ప్రాంతాల్లో భూగర్భంలో నీరు ప్రవహించడానికి గుహలు, మార్గాలు ఏర్పడతాయి. అలాంటి మార్గాల ద్వారా నీరు బయటకు వచ్చి ఒంబ్లా నదిగా ప్రవహిస్తుంది.
ఈ నది కేవలం కొన్ని పదుల మీటర్ల దూరమే ప్రవహించినా, దీని నీటి ప్రవాహం సెకనుకు సుమారు 23.9 ఘనపు మీటర్లుగా నమోదైనట్లు క్రొయేషియా జలవనరుల సంస్థ పేర్కొంది. కొద్దిదూరంలోనే నీరు అడ్రియాటిక్ సముద్రంతో కలుస్తుంది. అంటే నది పొడవు తక్కువగా ఉన్నంత మాత్రాన నీటి ప్రవాహం కూడా తక్కువగా ఉంటుందని భావించకూడదు. ఒంబ్లా దీనికి ఉదాహరణ.
జెజెర్నికా నది
స్లోవేనియాలోని ఇద్రిజా ప్రాంతంలో జెజెర్నికా నది ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 55 మీటర్లు. స్లోవేనియాలో ఉపరితలంపై ప్రవహించే అతి చిన్న నదిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ నది డివ్జే జెజెరో అనే సరస్సు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సరస్సులోకి భూగర్భ మార్గాల ద్వారా నీరు చేరుతుంది. అక్కడి నుంచి బయటకు ప్రవహించే నీరు జెజెర్నికా నదిగా మారి కేవలం 55 మీటర్ల దూరం ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.
కొన్ని మీటర్ల పొడవున్నా వాటిని నదులుగా ఎందుకు పిలుస్తారు?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక నీటి ప్రవాహాన్ని నదిగా పరిగణించడానికి అది కనీసం ఇన్ని కిలోమీటర్లు ఉండాలనే సార్వత్రిక నియమం లేదు. నది ఎంత పొడవుగా ఉందన్నదానికంటే నీరు ఎలా ప్రవహిస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి చేరుతోంది అనే అంశాలు ముఖ్యం.
నదికి ఉండే ప్రధాన లక్షణాలు ఇవే
నీటికి మూలం ఉండాలి : వర్షపు నీరు, కొండలు, సరస్సులు, నీటి ఊటలు లేదా భూగర్భ జలాల నుంచి ప్రవాహం ప్రారంభం కావచ్చు.
నిర్దిష్ట ప్రవాహ మార్గం ఉండాలి : నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సహజంగా ప్రవహించాలి.
నీరు మరో జలవనరులో కలవాలి : నది సముద్రం, సరస్సు లేదా మరో నదిలో కలవవచ్చు.
సహజమైన జలప్రవాహం కావాలి : కేవలం నిల్వగా ఉన్న నీటిని నదిగా పరిగణించలేం.
అయితే ప్రతి ప్రాంతంలో నదులను గుర్తించే పద్ధతులు ఒకేలా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల భౌగోళిక లక్షణాలు, మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాలు, జలవనరుల నిర్వహణ ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
నది పొడవును ఎలా కొలుస్తారు?
నది పొడవును కొలిచేటప్పుడు దాని ప్రారంభ స్థానం, ప్రవాహ మార్గం, ముగింపు స్థానం నిర్ణయించడం ముఖ్యం. చిన్న నదుల విషయంలో ఈ కొలత మరింత కీలకంగా మారుతుంది. మొత్తంగా చూస్తే.. నది అంటే వందల కిలోమీటర్లు ప్రవహించే భారీ జలప్రవాహమే కావాల్సిన అవసరం లేదు. సహజంగా నీరు ప్రవహించే మార్గం ఉండి, అది మరో జలవనరులో కలిసినా అది నదిగా గుర్తింపు పొందవచ్చు. అందుకే కొన్ని మీటర్ల పొడవున్న ఈ చిన్న నదులు కూడా భౌగోళిక ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

