Gold Jewellery: బంగారు నగలతోనే రోజూ స్నానం చేస్తే వాటి మెరుపు పోతుందా?
Gold Jewellery: ఎంతో మంది మహిళలు స్నానం చేసేటప్పుడు బంగారు నగలు తీయరు. ఇలా ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల వాటి మెరుపు దెబ్బతింటుందని అంటారు. ఇది ఎంతవరకు నిజం?

స్నానం చేసేటప్పుడు గోల్డ్ తీసేయాలా?
ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు బంగారు నగలు తీసి.. మళ్లీ వేసుకోవడం బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది వాటిని తీయకుండానే స్నానం చేస్తారు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల బంగారం మెరుపు తగ్గిపోతుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసా? సబ్బులు, షాంపూలు, బాడీ వాష్‌లు నగల సందుల్లో పేరుకుపోయి, కాలక్రమేణా ఓ పొరలా ఏర్పడతాయి. ఈ పొర బంగారం సహజమైన మెరుపును కప్పేసి, నగలను డల్‌గా కనిపించేలా చేస్తుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు బంగారు నగలను తీసేయడమే మంచిది.
త్వరగా మెరుపు పోతుంది
స్నానానికి మనం వాడే సబ్బు, షాంపూలాంటివి బంగారు నగల మెరుపును ప్రభావితం చేస్తాయి. ఇవి నగలపై ఒక పొరను ఏర్పరుస్తాయి. ముఖ్యంగా, రాళ్లు పొదిగిన లేదా సూక్ష్మమైన డిజైన్లు ఉన్న నగల సందుల్లో ఇవి సులభంగా పేరుకుపోతాయి. కొన్ని రోజులకు ఈ పొర గట్టిపడి, బంగారం మృదువైన ఉపరితలాన్ని మసకబారేలా చేస్తుంది. 22 క్యారెట్ల బంగారం ఇలాంటి రసాయనాల వల్ల త్వరగా మెరుపును కోల్పోతుంది.
బంగారు నగలను ఎలా చూసుకోవాలి?
రోజూ ధరించే బంగారు నగల మెరుపును కాపాడుకోవాలంటే, వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి నగలను క్లీన్ చేయాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా సబ్బు నీళ్లు కలిపి, అందులో నగలను కొన్ని నిమిషాలు నానబెట్టండి. తర్వాత, మెత్తటి టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది, శుభ్రమైన నీటితో కడిగి, మెత్తటి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. గాఢమైన రసాయనాలు ఉన్న క్లీనర్లను వాడొద్దు. ఇది నగల జీవితకాలాన్ని కచ్చితంగా పెంచుతుంది.

