- Home
- Feature
- Rice Capital : రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, భారదేశపు అన్నపూర్ణ రాష్ట్రం ఏది? ఎందుకిలా పిలుస్తారు?
Rice Capital : రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, భారదేశపు అన్నపూర్ణ రాష్ట్రం ఏది? ఎందుకిలా పిలుస్తారు?
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువ వరి పండించే రాష్ట్రాలు ఉన్నాయి. అయినా ఈ రాష్ట్రాన్నే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశ అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు?

రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏది?
భారతదేశంలో వరి సాగు అనగానే గుర్తుకొచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో విస్తరించిన పచ్చని పంట పొలాలు, ఎటుచూసినా కనిపించే వరి చేలు, సమృద్ధిగా లభించే సాగునీరు ఏపీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' (Rice Bowl of India), 'భారతదేశపు అన్నపూర్ణ' అని పిలుస్తుంటారు.
ఒకప్పుడు దేశానికి అవసరమైన బియ్యంలో గణనీయమైన వాటాను అందించిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పటికీ వరి సాగులో కీలకమైన రాష్ట్రంగా కొనసాగుతోంది. అయితే అసలు ఏపీలో వరి సాగు ఇంత విస్తృతంగా ఉండటానికి కారణమేంటి? ఇక్కడ ఏయే ప్రాంతాల్లో అత్యధికంగా వరి పండుతుంది? ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది? దేశంలో వరి ఉత్పత్తిలో ఏపీ స్థానం ఎంత? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కృష్ణా, గోదావరి నదులే ఏపీకి వరం..
ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగు విస్తృతంగా ఉండటానికి ప్రధాన కారణం ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, నదీ జలాలు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులు రాష్ట్ర వ్యవసాయానికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఈ నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఏర్పడిన సారవంతమైన ఒండ్రు నేలలు వరి సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. పంటకు అవసరమైన నీరు అందుబాటులో ఉండటంతో రైతులు విస్తారంగా వరి సాగు చేపడుతున్నారు.
గోదావరి డెల్టా పరిధిలోని తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాలు... కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు ప్రాంతాలు వరి సాగుకు ప్రసిద్ధి చెందాయి. వీటితో పాటు నెల్లూరు, కోనసీమ, ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ వరి పంటను పెద్దఎత్తున సాగు చేస్తారు.
ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ వంటి నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా పొలాలకు సాగునీరు అందుతోంది. కాలువల వ్యవస్థ కారణంగా డెల్టా ప్రాంతాల్లో వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం రైతులకు లభిస్తోంది.
ఏడాదికి రెండు పంటలు..
ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ రైతులు ప్రధానంగా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వరి పండిస్తారు. సాధారణంగా ఖరీఫ్ పంట వర్షాకాలంలో ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య నాట్లు వేయడం, ప్రాంతాన్ని బట్టి పంట కోత చేపట్టడం జరుగుతుంది. ఇక రబీ సీజన్లో మాత్రం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరి సాగు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో సాగునీటి లభ్యతను బట్టి రబీ పంటను కూడా పెద్దఎత్తున సాగు చేస్తారు.
ఈ రెండు సీజన్లలోనూ వరి సాగు కొనసాగడం వల్ల రాష్ట్రంలో ఏడాది పొడవునా బియ్యం ఉత్పత్తి జరుగుతోంది. అయితే వర్షాలు, సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి సాగు విస్తీర్ణం, దిగుబడుల్లో మార్పులు ఉంటాయి.
ఏపీలో ఎంత వరి పండుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగు ఎంత విస్తృతంగా ఉందో గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏపీ ప్రభుత్వ 2024-25 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 20.97 లక్షల హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. దీని ద్వారా ఏకంగా 127.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఖరీఫ్ సీజన్లో 14.04 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా.. 78.79 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఇక రబీ సీజన్లో 6.93 లక్షల హెక్టార్లలో సాగు చేపట్టి 48.36 లక్షల టన్నుల దిగుబడి సాధించారు.
2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25లో రాష్ట్రంలో వరి ఉత్పత్తి 12.95 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాది 112.57 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి.. తర్వాతి ఏడాది 127.15 లక్షల టన్నులకు చేరింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు 14.58 లక్షల టన్నుల అదనపు ధాన్యం ఉత్పత్తి అయ్యింది.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ధాన్యం (Paddy), బియ్యం (Rice) ఉత్పత్తి గణాంకాలు ఒకేలా ఉండవు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత పొట్టు, తవుడు తొలగిపోవడంతో బియ్యం పరిమాణం తగ్గుతుంది. అందుకే వివిధ ప్రభుత్వ రిపోర్ట్స్ లో ఈ రెండు గణాంకాలు వేర్వేరుగా కనిపిస్తాయి.
ఎకరాకు ఎంత వరి దిగుబడి వస్తుంది?
వరి సాగులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత కేవలం సాగు విస్తీర్ణం మాత్రమే కాదు.. దిగుబడి కూడా. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2024-25 వ్యవసాయ గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు సగటున 3,928 కిలోల బియ్యం ఉత్పత్తి నమోదైంది. అంటే సుమారుగా ఎకరాకు 1,589 కిలోల బియ్యం దిగుబడి వస్తున్నట్లు ఈ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. ఇదే రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణంలో 97.24 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది (2023-24 గణాంకాలు). ఇది దేశంలోని అనేక ఇతర ప్రాంతాలతో పోలిస్తే గణనీయమైన విషయం.
దేశంలో వరి ఉత్పత్తిలో ఏపీ స్థానం ఎంత?
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో వరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ వరి సాగు గణనీయంగా విస్తరించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు వరి ఉత్పత్తిలో ముందున్నాయి.
కేంద్ర ప్రభుత్వ 2024-25 వ్యవసాయ గణాంకాల ప్రకారం... దేశంలో మొత్తం 150.18 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 20.76 మిలియన్ టన్నులతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 17.45 మిలియన్ టన్నులతో రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్ 16.02 మిలియన్ టన్నులతో మూడో స్థానంలో ఉన్నాయి.
ఆ తర్వాత పంజాబ్ 14.36 మిలియన్ టన్నులు, ఛత్తీస్‌గఢ్ 10.37 మిలియన్ టన్నులు, ఒడిశా 9.53 మిలియన్ టన్నులు, మధ్యప్రదేశ్ 9.11 మిలియన్ టన్నులు, బీహార్ 8.30 మిలియన్ టన్నులతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 8.16 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే చారిత్రక గుర్తింపు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో లేదు. అయితే వరి దిగుబడి, సాగునీటి సౌకర్యాల పరంగా ఇప్పటికీ ముఖ్యమైన రాష్ట్రంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ బియ్యానికి ఎందుకు ప్రత్యేక గుర్తింపు?
ఏపీలో పండే బియ్యానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా సోనా మసూరి వంటి సన్నరకాల బియ్యానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలో పండించే వివిధ రకాల ధాన్యాన్ని స్థానిక అవసరాలకు ఉపయోగించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తుంటారు.
వరి సాగుతో రైతులకు మాత్రమే కాకుండా అనేక రంగాలకు ఉపాధి లభిస్తోంది. వరి కోతలు, ధాన్యం సేకరణ, రవాణా, మిల్లింగ్, బియ్యం ప్యాకింగ్, మార్కెటింగ్ వంటి కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో బియ్యం మిల్లులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి.
రైస్ బౌల్ గుర్తింపును నిలబెట్టుకోవడం సవాలేనా?
ఆంధ్రప్రదేశ్‌కు వరి సాగులో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుపానులు, తెగుళ్లు, సాగు ఖర్చుల పెరుగుదల, కూలీల కొరత వంటివి వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయి.
ముఖ్యంగా వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నీటి పొదుపు పద్ధతులు, ఆధునిక సాగు విధానాలు, యాంత్రీకరణను ప్రోత్సహించడం అవసరం. నాణ్యమైన విత్తనాలు, సరైన ఎరువుల వినియోగం, సమయానికి ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి.
మొత్తానికి.. ఆంధ్రప్రదేశ్‌ను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలవడం వెనుక కేవలం వరి పంట మాత్రమే కాదు.. నదులు, సారవంతమైన నేలలు, నీటిపారుదల వ్యవస్థలు, రైతుల కష్టం, వ్యవసాయ వారసత్వం ఉన్నాయి. దేశంలో వరి ఉత్పత్తి ర్యాంకుల్లో మార్పులు వచ్చినా.. భారతదేశ బియ్యం ఉత్పత్తి, ఆహార భద్రతలో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్రను కొనసాగిస్తోంది.





