No Capital Country: ప్రపంచంలో రాజధాని లేని ఒకే ఒక్క దేశం ఏదో తెలుసా?
No Capital Country: అన్ని దేశాలకు రాజధానులు ఉంటాయి. అధికారిక రాజధాని నుంచే ఆ దేశ వ్యవహారాలను నాయకులు చక్కబెడతారు. కానీ రాజధాని లేని ఒకే ఒక్క దేశం ఉంది. ఆ దేశం ఏదో.. ఎందుకు రాజాధాని లేదో తెలుసుకోండి.

రాజధాని లేని దేశం
ప్రపంచంలో ప్రతి దేశానికి ఓ రాజధాని ఉంటుంది. అక్కడే ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్, ఇతర ముఖ్యమైన సంస్థలు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఓ చిన్న దేశానికి మాత్రం అధికారికంగా ప్రకటించిన రాజధాని నగరం లేదు. ఆ దేశం పేరు నౌరు. పసిఫిక్ మహాసముద్రంలోని మైక్రోనేషియా ప్రాంతంలో ఉన్న ఈ ద్వీప దేశం విస్తీర్ణం కేవలం 21 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో నౌరు ఒకటి. 1968లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇంత చిన్న దేశానికి ప్రత్యేకంగా ఓ రాజధాని నగరం లేకపోవడం భౌగోళిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతాయి?
నౌరుకు అధికారిక రాజధాని లేకపోయినా, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ యారెన్ జిల్లాలోనే ఎక్కువగా జరుగుతాయి. అక్కడే పార్లమెంట్, అధ్యక్షుడి కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అందుకే చాలామంది యారెన్‌ను నౌరు రాజధానిగా చెబుతుంటారు. అయితే ఆ దేశ చట్టాల్లో యారెన్‌కు అధికారిక రాజధాని హోదా ఇవ్వలేదు. అందువల్ల యారెన్‌ను అధికారిక రాజధాని అని కాకుండా, ప్రభుత్వ కార్యకలాపాలు జరిగే ప్రధాన ప్రాంతంగా చెప్పవచ్చు. నౌరులో పెద్ద పెద్ద నగరాల కంటే పరిపాలనా జిల్లాలే ఎక్కువగా కనిపిస్తాయి. దేశం చిన్నదిగా ఉండటంతో ఒకే ప్రాంతంలో ప్రభుత్వ పనులు నిర్వహించడం సులభంగా మారింది.
చిన్న దేశం.. ప్రత్యేక గుర్తింపు
నౌరు చిన్న దేశమే అయినా దాని చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఫాస్ఫేట్ ఖనిజాల తవ్వకం ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఈ ఖనిజాలను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. కాలక్రమంలో ఖనిజ నిల్వలు తగ్గడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం నౌరు ఆస్ట్రేలియా డాలర్‌ను తన కరెన్సీగా ఉపయోగిస్తోంది. రాజధాని నగరం లేకపోయినా, ప్రభుత్వం తన కార్యకలాపాలను యారెన్ కేంద్రంగా కొనసాగిస్తోంది. ప్రపంచ పటంలో చిన్న ప్రాంతంగా కనిపించే నౌరు, అధికారిక రాజధాని లేని దేశంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సాధారణంగా ప్రతి దేశానికి రాజధాని ఉంటుందని అనుకుంటాం. కానీ నౌరు ఆ భావనకు భిన్నమైన ఉదాహరణగా నిలుస్తోంది.

