Rich Beggar: ఈ బిచ్చగాడు పెద్ద వడ్డీ వ్యాపారి.. 3 ఇళ్లు, కార్లు, ఆటోలు
Rich Beggar: కేవలం భిక్షాటనతోనే ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. మూడు ఇళ్లు, కార్లు, ఆటోలు కొన్నాడు. అడుక్కున్న డబ్బును వడ్డీకి ఇచ్చి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ బిచ్చగాడికి ఉన్న ఆస్తులు చూసి ప్రభుత్వాధికారులే షాక్ అయ్యారు.

డబ్బున్న బిచ్చగాడు
బిచ్చగాడు సినిమా చూసే ఉంటారు. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా హీరో బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కూడా కోటీశ్వరుడే. అయితే ఈయన భిక్షాటన చేస్తూనే లక్షలు సంపాదించాడు. అందుకే ఎంత ఆస్తి ఉన్నప్పటికీ తన పనిని మాత్రం వదలడం లేదు. అదే తన ఉద్యోగంలా ప్రతిరోజూ ఉదయం లేచి భిక్షాటనలకు చిన్న చెక్కను ముందుకు తోసుకుంటూ వెళ్లిపోతాడు. ఇతను నడవలేడు. ఆ చెక్కమీద అతడి ప్రయాణం సాగుతుంది. ఈ బిచ్చగాడిని రోడ్డు మీద చూసి అయ్యోపాపం అంటారు కానీ… ఇతని ఆస్తులు చూస్తే మాత్రం నోరెళ్లబెడతారు. ఇతనికి మూడు ఇల్లు ఉన్నాయి. సొంత కారు, ఆటోలు కూడా ఉన్నాయి. ఆటోలను వేరే వారికి అద్దెకు ఇచ్చి సంపాదన పొందుతాడు.అలాగే ఇళ్లు అద్దెకు ఇచ్చాడు. అన్నట్టు ఇతడు వడ్డీ వ్యాపారి కూడా. ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదూ మంగలాల్. నివసించేది మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల భిక్షాటన నిర్మూలన ఉద్యమం ప్రారంభించింది. అందులోనే ఈ బిచ్చగాడి సంపద గురించి తెలిసింది. అతడి ఆస్తులు చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న మంగీలాల్ చాలా సంవత్సరాలుగా ఇండోర్‌లోని ప్రముఖ వీధుల్లో భిక్షాటన చేస్తూ కోటీశ్వరుడయ్యాడు.
భిక్షాటనతోనే సంపాదన
మంగీలాల్ రద్దీగా ఉండే రోడ్డుపై చేతితో నెట్టే చెక్క బండిపై తిరుగుతూ ఉంటాడు. ఈ మంగీలాల్‌కు మూడు అంతస్తుల భవనం, స్విఫ్ట్ డిజైర్ కారు, అద్దెకిచ్చిన మూడు ఆటో రిక్షాలతో సహా మూడు ఇళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భిక్షాటన, వాహనాల అద్దె ద్వారా వచ్చిన డబ్బును చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు అప్పుగా కూడ ఇచ్చి వడ్డీని పొందుతున్నాడు.
ఇండోర్ నగరం మన దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందింది. కానీ భిక్షాటన చేసే వారు అధికంగా ఉన్నారు. దీంతో ఇండోర్‌లో జనవరి 1 నుంచే భిక్షాటనను నిషేధించారు. బిచ్చగాళ్ల గురించి అధికారులకు సమాచారం ఇచ్చిన వారికి వెయ్యి రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎవరో మంగీలాల్ గురించి సమాచారం ఇచ్చారు. అతని గురించి తెలుసుకోవడానికి వెళ్లిన అధికారులు అతని ఆస్తులు చూసి షాక్ అయ్యారు.
తప్పించుకు పారిపోయినా...
అధికారులు చెబుతున్న ప్రకారం మంగీలాల్ ఇండోర్ లోని సరాఫా చౌపటీలో ఉంటున్నాడు. అధికారుల బృందం శనివారం రాత్రి సరాఫాకు వెళ్ళింది. అక్కడ భిక్షాటన చేస్తున్న మంగీలాల్‌ను చూశారు. అధికారులు తనకోసమే వచ్చారని అర్థమైపోయి అక్కడ్నించి తప్పించుకున్నాడు మంగీలాల్. కానీ అధికారులు అతడిని వదలకుండా వెంటాడి పట్టుకున్నారు.
మంగీలాల్ వయసు 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటుంది. అతను నగరంలోని అల్వాసా ప్రాంతంలో కుష్టురోగుల ఆశ్రమం దగ్గర, దివ్యాంగులకు అధికారులు కేటాయించిన ఇంట్లో తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. ఇది కాకుండా అతనికి మరో రెండు ఇళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి మూడు అంతస్తులతో ఉంటుంది. మరొకటి ఒకే అంతస్తుది. రెండూ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. దీనితో పాటు అతనికి మూడు ఆటో రిక్షాలు ఉన్నాయి. వాటిని అద్దెకు నడుపుతున్నాడు. అంతేకాకుండా, అతనికి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ఉంది. వడ్డీకి అప్పులిచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మంగీలాల్ అధికారులకు చెప్పాడు.
రోజుకు ఎంత సంపాదన?
తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులనే వీధి వ్యాపారులకు వడ్డీకి ఇస్తానని చెప్పాడు మంగీలాల్. దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు వడ్డీకి తిప్పుతున్నట్టు చెప్పాడు. అలాగే ఆటో అద్దెలు కూడా వస్తాయని అన్నాడు. అప్పుల ద్వారా వచ్చే వడ్డీ రోజుకు 1000 నుంచి 2000 రూపాయలు వస్తుందని చెప్పాడు. భిక్షాటన చేస్తూ రోజుకు 400 నుంచి 500 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇతని సంపాదన నెలకు లక్ష రూపాయలకు తగ్గదు. ఇన్ని ఉన్నా ఏమీ లేనట్టు భిక్షాటన చేస్తున్నాడు. అతని దీనమైన వేషం చూసి ఇక్కడి వీధుల్లో తినడానికి వచ్చే వందలాది మంది అతనికి డబ్బు ఇస్తారు. ఇప్పుడు అధికారులు మంగీలాల్ బిచ్చగాళ్ల పునరావాస కేంద్రంలో చేర్పించారు.
కొంచెం దూర ప్రాంతానికి భిక్షాటనకు వెళ్లాల్సి వస్తే కారులో వెళ్తాడు మంగీలాల్. తన కారును ఒక పక్కగా పార్క్ చేస్తాడు. ఆ తర్వాత తన చేతితో నెట్టే చెక్క బండితో సరాఫా ప్రాంతానికి వస్తాడు. ఈ ప్రాంతంలో ఎక్కువగా చిరు తిళ్లు తినేందుకు ఎక్కువ మంది వస్తారు. వారు ఇతని వేషం చూసి డబ్బు ఇస్తారు. ఇతను 2021 నుంచి భిక్షాటన చేస్తున్నట్టు చెప్పాడు.

