ఒకరిని వెంటనే జడ్జ్ చేయడం ఎంత తప్పో.. ఈ చిన్నపాప కథ చదివితే మీకే అర్థమవుతుంది!
మనలో చాలామంది ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. మనం చూసిన ఏదో ఒక్క చర్యను బట్టి.. వారి మనసు తెలుసుకోకుండానే వారి గురించి ఏదో ఒకటి అనుకుంటారు. కానీ అది ఎంత తప్పో ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది.

Motivational Story..
ఒక చిన్న పాప తన రెండు చేతుల్లో రెండు ఆపిల్స్ పట్టుకొని ఉంటుంది. అది చూసిన వాళ్ల అమ్మ నవ్వుతూ దగ్గరకు వచ్చి నాకో ఆపిల్ ఇవ్వు తల్లి అని ప్రేమగా అడుగుతుంది. ఆ పాప వెంటనే రెండు ఆపిల్స్‌ను ఒక్కొక్కటిగా కొరుకుతుంది. అది చూసిన తల్లి మనసు కాస్త చివుక్కుమంటుంది. ఇంత చిన్న వయసులోనే తన బిడ్డ స్వార్థం చూసి తల్లి మొహంలో నవ్వు మాయమవుతుంది. అక్కడి నుంచి వెళ్లి పెరట్లో ఓ చెట్టు కింద కూర్చుంటుంది. ఇంతలో ఆ పాప తల్లిని వెతుక్కుంటూ వచ్చి ఒక చేయి ముందుకు చాచి 'అమ్మా..! ఈ ఆపిల్ తియ్యగా ఉంది. ఇది తీసుకో అంటుంది.
ఆ పాప రెండు ఆపిల్స్ ఎందుకు కొరికిందో తల్లికి అప్పుడు అర్థమవుతుంది. తను ఆలోచించిన విధానానికి సిగ్గు పడుతుంది. తన తప్పును గ్రహించి బాధపడుతుంది.
తను చేయాలనుకున్నది వేరు..
ఈ కథలో చిన్న పాప చేసే పని చూస్తే మామూలుగా ఎవరికైనా నెగిటివ్ అభిప్రాయమే కలగవచ్చు. కానీ వాస్తవానికి ఆ పాప చేయాలనుకున్న పని ఎంతో మంచిది. వాళ్ల అమ్మకి తియ్యని ఆపిల్ ఇవ్వాలనుకుంది. కానీ తల్లి ఆ బిడ్డను అర్థం చేసుకోలేకపోయింది.
వెంటనే జడ్జ్ చేయడం వల్ల కలిగే నష్టాలు:
నిజ జీవితంలో కూడా మనలో చాలామంది ఎదుటి వారి భావాలను అర్థం చేసుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదో ఒక్క చర్యను చూసి ఒక వ్యక్తిని జడ్జ్ చేసేయడం, వారిపై వెంటనే ఒక అభిప్రాయానికి రావడం వల్ల.. కొన్నిసార్లు మంచి మనిషిని కూడా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది.
పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాలి:
ఒకరి ప్రవర్తన చూడగానే వెంటనే “ఇతను ఇలానే ఉంటాడు” అనే అభిప్రాయానికి రాకూడదు. వారితో మాట్లాడాలి. వారి వైపు నుంచి కూడా మనం విషయాన్ని చూడాలి. ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఒక్కో విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. మనం వారి కోణంలో చూస్తేనే.. అది మనకు అర్థమవుతుంది. తన ప్రవర్తన వెనుక కారణమేంటో తెలియకపోతే, సున్నితంగా మాట్లాడాలి. వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న పొరపాటుతో మంచి మనిషిని కోల్పోవద్దు. చూసిన, విన్న వెంటనే నిజం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవద్దు.