Muslim Priest : హిందూ దేవాలయంలో ముస్లిం పూజారి.. ఎక్కడో కాదు మనదగ్గరే..!
హిందూ ముస్లింలను సోదరులుగా పేర్కొనే దేశం మనది. దీనికి నిదర్శనంగా నిలిచే ఓ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది… ఓ ముస్లిం పూజారిగా పనిచేసే ప్రత్యేకత దీని సొంతం. ఇంతకీ ఈ ఆలయం ఏపీలో ఎక్కడుందో తెలుసా?

ముస్లిం పూజారిగా ఉన్న ఆలయమేది?
Muslim Priest : సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా బ్రాహ్మణులే పూజారులుగా కనిపిస్తారు. కొన్ని ఆలయాల్లో హిందువుల్లోనే ఇతర కులాలవారు కూడా పూజారులుగా వ్యవహరిస్తారు. కానీ ఓ ముస్లిం పూజారిగా గల ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో కాదు మన ఆంధ్ర ప్రదేశ్ లోనే. హిందూ, ముస్లింల మధ్య మతసామరస్యాన్ని చాటే ఆ ఆలయం ఎక్కడుంది? ఓ ముస్లిం పూజారిగా ఎలా మారాడు? వంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హిందూ ఆలయంలో ముస్లిం పూజారి
ఆంధ్ర ప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ప్యామిలి పట్టణంలో అనేక ఆలయాలున్నాయి... అందులో అమ్మవారి ఆలయం చాలా స్పెషల్. ఇక్కడి పూజారి కారణంగా ఈ ఆలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసేది ఓ ముస్లిం.
ఇతర మతాలకు చెందినవారికి గుడిలోకి రానివ్వని రోజులనుండి అర్చకుడిగా ఓ ముస్లిం పనిచేనే రోజు వచ్చింది. నమాజ్ చేయాల్సిన వ్యక్తి వేదమంత్రాలను వళ్లిస్తూ పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమ్మవారి ఆలయానికి వెళ్లిన భక్తులకు ఎవరైనా చెబితేగానీ తెలీదు పూజ చేసేది ఓ ముస్లిం అని. ఇతర ఆలయాల్లో ఎలాగైతే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అచ్చం అలాగే ప్యామిలిలోని అమ్మవారి ఆలయంలో పూజలు జరుగుతాయి.
ముస్లిం యువకుడు పూజారిగా ఎలా మారాడో తెలుసా?
కర్నూల్ జిల్లా ప్యామిలిలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు ఇమాం బాషా. అతడికి చదువు సరిగ్గా అబ్బకపోవడంతో ఓ హోటల్లో పనిచేసేవాడు. అయితే ఇతడు ఇంటి నుండి హోటల్ కు వెళ్లే దారిలో ఓ చిన్న ఆలయం ఉండేది. ముస్లిం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ అతడు అమ్మవారికి దండం పెట్టుకునేవాడు. ఇలా ఏళ్లుగా అతడు అమ్మవారిని భక్తిశ్రద్దలతో నమ్మేవాడు.
అయితే ఒకరోజు రాత్రి ఇమాం బాషా పడుకుని సమయంలో అమ్మవారు కలలోకి వచ్చారట. ప్రతిరోజు తనకు పూజ చేసుకునే అవకాశం ఇస్తున్నానని... భక్తిశ్రద్దలతో నిర్వహించాలని సూచించారట. అప్పటినుండి ఇమాం బాషా అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు. చిన్న ఆలయాన్ని చందాలు, సొంత డబ్బులతో పున:నిర్మించాడు... పూర్తిస్థాయి పూజారిగా మారిపోయాడు.
అచ్చం పూజారిలాగే మారిపోయిన ఇమాం బాషా
తన జీవితాన్ని అమ్మవారికే అంకితం చేసి పూజారిగా మారాడు ఇమాం బాషా. ఇతర పనులన్నీ మానుకుని పూర్తిస్థాయి పూజారిగా మారిపోయాడు. ఎంతోమంది అతడిని వ్యతిరేకించినా, హెచ్చరించినా వెనకడుగు వేయలేదు… అమ్మవారిని పూజించడం మానలేదు.
అన్ని గుళ్లలో పూజారుల మాదిరిగానే ఇతడి వేషధారణ ఉంటుంది... పంచ కట్టుకుని, నిండుగా బొట్టు పెట్టుకుని పూజలు చేస్తారు. అర్చనలు, అభిషేకాలు పూజలు చేస్తుంటారు... అతడు వేదమంత్రాలతో పూజా కైంకర్యాలు చేస్తుంటే భక్తులు ఆశ్చర్యపోతుంటారు. ఇలా ముస్లింలు పూజారిగా పనిచేసే ఆలయాలు దేశవ్యాప్తంగా చాలా అరుదు... అలాంటిది ఏపీలో ఉండటం ఆసక్తికరం.











