చింతించడం, బాధపడటం మధ్య తేడా ఏంటి.? ఈ కథ చదివితే జీవత సారం తెలుస్తుంది
Motivational Story: బాధపడడం, చింతించడం.. వినడానికి ఈ రెండు పదాలు ఒకేలా ఉంటాయి. కానీ వీటి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉన్నా.. మన జీవితంపై వాటి ప్రభావం చాలా పెద్దది. ఈ తేడాను ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం.

ఒకే సమస్య.. ఇద్దరు వ్యక్తులు
ఒక చిన్న పట్టణంలో రవి, సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు. ఒకరోజు ఆ కంపెనీకి నష్టాలు రావడంతో యాజమాన్యం కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఆ ఉద్యోగుల జాబితాలో రవి, సురేష్ పేర్లు కూడా ఉన్నాయి. ఉద్యోగం పోవడంతో ఇద్దరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. నెలవారీ జీతం మీద ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్న వారికి ఇది పెద్ద సమస్యే. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, అప్పుల వాయిదాలు ఎలా కట్టాలో అర్థం కాలేదు. భవిష్యత్తు గురించి భయం మొదలైంది. అయితే ఆ సమస్యను ఇద్దరూ వేర్వేరు విధాలుగా ఎదుర్కొన్నారు. రవి రోజంతా ఉద్యోగం పోయిందని చింతిస్తూ కూర్చున్నాడు. తనకు మాత్రమే ఎందుకిలా జరిగిందని ఆలోచించాడు. మరోవైపు సురేష్ కూడా బాధపడ్డాడు. కానీ ఆ బాధలోనే ఉండిపోకుండా, తర్వాత ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాడు. ఇక్కడే ఇద్దరి మధ్య అసలైన తేడా మొదలైంది.
చింతించడం అంటే జరిగిన విషయాన్నే తలుచుకుంటూ ఉండటం
ఉద్యోగం పోయిన తర్వాత రవి ప్రతిరోజూ తన స్నేహితులతో అదే విషయం చెప్పేవాడు. కంపెనీ తనకు అన్యాయం చేసిందని, తన భవిష్యత్తు నాశనమైందని అనుకునేవాడు. ఇంట్లో ఉన్నా ఉద్యోగం గురించే ఆలోచించేవాడు. బయటకు వెళ్లినా అదే బాధ. ఎవరైనా కొత్త ఉద్యోగం గురించి మాట్లాడితే తన పరిస్థితిని గుర్తుచేసుకుని మరింత నిరాశ చెందేవాడు.
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాలనే ఆలోచన వచ్చినా, తనకు ఎవరు ఉద్యోగం ఇస్తారని వెనక్కి తగ్గేవాడు. ఇలా రోజులు గడిచిపోయాయి. సమస్యకు పరిష్కారం వెతకాల్సిన సమయంలో, జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ప్రతీ నిమిషం చింతిస్తూనే ఉన్నాడు. నిజానికి ఉద్యోగం పోవడం రవి తప్పు కాకపోవచ్చు. కానీ ఆ సంఘటన తర్వాత జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం మాత్రం అతని చేతుల్లోనే ఉంది. బాధపడటం తప్పు కాదు. మనకు ఇష్టమైనది దూరమైనప్పుడు, ఆశించినది జరగనప్పుడు బాధ కలగడం సహజం. కానీ అదే బాధలో ఉండిపోయి, ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకపోవడమే చింతించడం.
బాధపడడం సహజం
సురేష్‌కు కూడా ఉద్యోగం పోయిన బాధ ఉంది. తన కుటుంబాన్ని ఎలా పోషించాలనే ఆందోళన కూడా ఉంది. కానీ అతను ఒక విషయం గుర్తించాడు. ఉద్యోగం పోయిందనే నిజాన్ని మార్చలేడు. అయితే కొత్త ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నించగలడు.
ముందుగా తన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉందో లెక్క వేసుకున్నాడు. అవసరం లేని ఖర్చులను తగ్గించాడు. తనకు తెలిసిన స్నేహితులకు ఫోన్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. తనకు మరింత ఉపయోగపడే కంప్యూటర్ నైపుణ్యాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాడు.
మొదట్లో అతనికి కూడా నిరాశ ఎదురైంది. కొన్ని కంపెనీలు తిరస్కరించాయి. మరికొన్ని చోట్ల నుంచి సమాధానమే రాలేదు. అయినప్పటికీ ప్రయత్నం ఆపలేదు. ఎందుకంటే అతని ఆలోచన ఒక్కటే.. సమస్య గురించి చింతించడం కంటే, దాన్ని పరిష్కరించడానికి ఏం చేయగలనో చూడాలి. ఇక్కడే బాధలో మునిగిపోవడానికి, చింతించడానికి మధ్య తేడా కనిపిస్తుంది. చింతించడం మనల్ని గతంలో జరిగిన సంఘటన దగ్గరే ఆపేస్తుంది. పరిష్కారం కోసం చేసే ఆలోచన మాత్రం భవిష్యత్తు వైపు అడుగులు వేయిస్తుంది.
కొంతకాలానికి ఇద్దరి జీవితాల్లో వచ్చిన మార్పు
రెండు నెలలు గడిచాయి. సురేష్ నిరంతర ప్రయత్నాల వల్ల మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మొదట జీతం పాత ఉద్యోగం కంటే కొంచెం తక్కువే వచ్చింది. అయినా దాన్ని ఒక అవకాశంగా భావించాడు. తన నైపుణ్యాలను పెంచుకుంటూ, క్రమంగా మెరుగైన స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు.
రవి మాత్రం అప్పటివరకు ఉద్యోగం కోసం పెద్దగా ప్రయత్నించలేదు. తనకు జరిగిన అన్యాయం గురించే ఆలోచిస్తూ , చింతిస్తూ రోజులు గడిపాడు. ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగాయి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఉద్యోగం పోయినప్పుడు ఇద్దరికీ ఒకే సమస్య ఎదురైంది. కానీ సురేష్ ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాడు. తాను మాత్రం చింతిస్తూనే ఉండిపోయాడు.
ఆ తర్వాత రవి కూడా తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడు. తనకు తెలిసిన పనులకు దరఖాస్తు చేయడం మొదలుపెట్టాడు. తనకు కొత్తగా ఏం నేర్చుకోవాలో తెలుసుకున్నాడు. కొంతకాలానికి అతనికి కూడా ఉద్యోగం వచ్చింది. ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సురేష్‌కు బాధ కలగలేదని కాదు. అతను బాధను తన జీవితాన్ని ఆపేసే కారణంగా మార్చుకోలేదు. రవి కూడా ఆలస్యంగానైనా తన పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నించాడు.
సమస్యను మార్చలేకపోయినా.. దాని గురించి మన ఆలోచనను మార్చుకోవచ్చు
మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన చేతుల్లో ఉండదు. మనకు ఇష్టమైన ఉద్యోగం పోవచ్చు. వ్యాపారంలో నష్టం రావచ్చు. మనం నమ్మిన వ్యక్తులు దూరం కావచ్చు. ఎంత కష్టపడినా అనుకున్న ఫలితం రాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో బాధపడటం సహజం. మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఇప్పుడు చింతిస్తూ కూర్చోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా.? లేక దాని నుంచి బయటపడటానికి నేను ఏదైనా చేయగలనా.? అప్పుడే జీవితంలో ముందడుగు వేయగలం.

