Snakes In Cars : వానాకాలంలో కార్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి?
వర్షాకాలంలో కదులుతున్న కార్లు, బైకుల్లో పాములు కనిపించడం సాధారణం. అసలు పాములు కార్లు, బండ్లలోకి ఎందుకు దూరతాయో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.

వర్షాకాలంలో వాహనాల్లోకి పాములు ఎందుకు చేరతాయి?
వర్షాకాలంలో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి.. పాముకాటు మరణాలు కూడా పెరుగుతాయి. అందుకే ఈ నాలుగు నెలలు పాములతో చాలా జాగ్రత్తగా ఉండాాలి. ఇళ్ల చుట్టుపక్కల, నివాస ప్రాంతాల్లో దట్టమైన పొదలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. అంతేకాదు ఇంటి బయట నిలిపే వాహనాల్లోకి కూడా పాములు చేరే అవకాశాలుంటాయి… ముఖ్యంగా కార్లు, బైకుల ఇంజిన్ కంపార్ట్‌మెంట్ లేదా బానెట్ కింద పాములు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.
కారులో నాగుపాము
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా బైక్స్, కార్లలో పాములు కనిపించిన ఘటనల గురించి ఎక్కువగా వింటున్నాం. తాజాగా ఘజియాబాద్ లో ఓ మహిళ కారు నడుపుతుండగా, డాష్‌బోర్డ్‌పై అకస్మాత్తుగా నాగుపాము కనిపించింది. దీంతో కారులో ఉన్నవారంతా భయంతో వణికిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న మహిళ సమయస్ఫూర్తి వ్యవహరించి పాముకాటు నుండి తప్పించుకుంది. పోలీసుల సహాయంతో పామును సురక్షితంగా బయటకు తరిమారు. ఈ ఘటనతో ప్రజల్లో పాములపై ఉన్న భయాన్ని మరింత పెంచింది.
కార్లలోకి పాములు ఎందుకు వస్తాయి?
పదేపదే కార్లు, బైకుల ఇంజిన్లలో పాములు కనిపించడంతో, అవి లోపలికి ఎందుకు వస్తాయనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. దీనికి ఓ కారణం ఉంది… అదేంటి? ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? పాములు రాకుండా ఎలా చూసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
వర్షాకాలంలో పాములు నివాసముండే పుట్టలు, బొరియల్లోకి నీళ్లు చేరతాయి. దీంతో అవి ఆశ్రయం కోల్పోతాయి… అక్కడి నుండి బయటకు వచ్చి పొడిగా, సురక్షితంగా ఉండే చోటు కోసం వెతుకుతాయి. కారు లేదా బైక్ ఇంజిన్ ఆపిన తర్వాత కూడా కాసేపటి వరకు వెచ్చగా ఉంటుంది. ఈ వెచ్చదనం పాములను ఆకర్షిస్తుంది. అందుకే అవి అక్కడకు వచ్చి చేరుకుంటాయి. ఇది కాకుండా కారు దగ్గరికి వచ్చే ఎలుకలు లేదా ఇతర చిన్న జీవులను తినడానికి కూడా పాములు వస్తాయి… కారు ఇంజిన్ భాగంలో దాక్కుంటాయి.
పాములు కారులో ఎక్కడెక్కడ దాక్కుంటాయి?
కారు ఇంజిన్, బానెట్ కింద, ఇంకా అనేక ఇతర ప్రదేశాలలో పాములు దాక్కుంటాయి. కారును పొలాలు, తోటలు, ఖాళీ స్థలాలు, పచ్చదనం ఉన్న చోట ఎక్కువసేపు పార్క్ చేస్తే, పాములు కారులోకి దూరే అవకాశం ఎక్కువ. అంతేకాదు ఎక్కువరోజులు కారును తీయకుండా ఉంటే అందులోకి ఎలుకలు చేరే అవకాశాలుంటాయి.. వాటికోసం పాములు వస్తుంటాయి.
కారులోకి పాము చేరకుండా ఈ జాగ్రత్తలు పాటించండి
- కారును ఎప్పుడూ సురక్షితమైన, ఖాళీ ప్రదేశంలో పార్క్ చేయండి. వీలైతే, క్లోజ్డ్ గ్యారేజీని వాడండి.
- కారు చుట్టూ చెత్త, ఎండిన గడ్డి, పాత వస్తువులు లేకుండా చూసుకోండి.
- ఎక్కువ కాలం ఒకేచోట నిలిపిన కారును అప్పుడప్పుడు స్టార్ట్ చేసి, కాసేపు నడపండి.
- ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌ను తరచుగా తనిఖీ చేయండి.
- డ్రైవింగ్ చేసే ముందు బానెట్ తెరిచి ఒకసారి సరిగ్గా చూడండి.
- కారు లోపల ఏమైనా శబ్దం వస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.

