London of India: మనదేశంలో ‘లండన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే నగరం ఇదే.. ఈ సిటీ వెరీ స్పెషల్
London in India: మనదేశంలో లండన్ అని పిలిచే నగరం ఏదో తెలుసా? ఒకప్పుడు ఇది మనదేశంలో చాలా ముఖ్యమైన నగరం. బ్రిటిష్ వాళ్లు ఈ నగరం నుంచి పాలన సాగించేవారు. అందుకు ఆ నగరాన్ని లండన్ ఆఫ్ ఇండియా అని పిలచుకునేవారు.

లండన్ ఆఫ్ ఇండియా ఏ సిటీ?
మనదేశం ఎన్నో ఏళ్లు బ్రిటిష్ వారి పాలనలోనే సాగింది. బ్రిటిష్ పాలన కాలంలో 1772 నుంచి 1911 వరకు, అంటే దాదాపు 140 ఏళ్ల పాటువ వారు మనల్ని పాలించారు. ఆ సమయంలో కోల్‌కతా బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో లండన్ తర్వాత అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన నగరంగా కోల్‌కతా గుర్తింపు పొందింది. పరిపాలనా కేంద్రంగా ఉండటంతో బ్రిటిష్ పాలకులు ఈ నగరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. తమ సొంత నగరమైన లండన్‌ను తలపించేలా కోల్‌కతా రూపురేఖలను మార్చారు. అందుకే నేటికీ ఈ నగరాన్ని ఇండియా లండన్‌గా పిలుస్తుంటారు.
అద్భుతమైన కట్టడాలు
కోల్‌కతాకు ఈ పేరు రావడానికి ప్రధాన కారణం అక్కడి అద్భుతమైన కట్టడాలు, నిర్మాణ శైలి. బ్రిటిష్ వారు తమ పాలనా కాలంలో విక్టోరియన్, గోతిక్, నియోక్లాసికల్ శైలిలో ఎన్నో భారీ భవనాలను నిర్మించారు. విక్టోరియా మెమోరియల్, రైటర్స్ బిల్డింగ్, కలకత్తా హైకోర్టు, జనరల్ పోస్ట్ ఆఫీస్, సెయింట్ పాల్స్ కేథడ్రల్ వంటి కట్టడాలు నేటికీ లండన్ వీధుల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడి భవనాల నిర్మాణంలో వాడిన పాలరాతి శిల్పకళ, విశాలమైన రహదారులు, పచ్చని ఉద్యానవనాలు అచ్చం బ్రిటన్ రాజధానిని గుర్తుకు తెస్తాయి. చారిత్రక వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన ఈ కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
లండన్ లాగే కనిపిస్తుంది
భౌగోళికంగా, సాంస్కృతికంగా కూడా కోల్‌కతాకు లండన్‌తో ఎన్నో పోలికలు ఉన్నాయి. లండన్ నగరం థేమ్స్ నది ఒడ్డున అభివృద్ధి చెందినట్లే, కోల్‌కతా హుగ్లీ నది తీరాన ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. అంతేకాకుండా, ఒకప్పుడు లండన్ వీధుల్లో సందడి చేసిన ట్రామ్ రైళ్లు భారతదేశంలో కేవలం కోల్‌కతాలో మాత్రమే నేటికీ నడుస్తున్నాయి. విద్య, కళలు, సాహిత్య రంగాల్లోనూ ఈ నగరం ఎంతో ముందుంది. బెంగాల్ పునరుజ్జీవనానికి కేంద్రంగా నిలవడమే కాకుండా, 1780లో దేశంలోనే తొలి వార్తాపత్రిక ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఎందరో గొప్ప రచయితలు, మేధావులు, కళాకారులకు నిలయంగా మారి, సాంస్కృతిక రాజధానిగా కోల్‌కతా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.














