మనిషి చనిపోయాక జుట్టు, గోళ్లు పెరుగుతాయన్నది నిజమేనా? సైన్సు చెప్పింది వింటే షాకవుతారు
మనిషి మరణించాక శరీరంలోని ప్రతి అవయవం పనిచేయడం ఆపేస్తుంది కానీ.. జుట్టు, గోళ్లు మాత్రం పెరుగుతూనే ఉంటాయని అంటారు. ఇలా ఎందుకు పెరుగుతాయి? ఎంతకాలం పాటూ పెరుగుతాయి? ఈ వివరాలను వివరంగా తెలుసుకోండి.

మనిషి చనిపోయాక జుట్టు, గోళ్లు పెరుగుతాయా?
మనిషి చనిపోయిన తర్వాత కూడా జుట్టు, గోళ్లు పెరుగుతాయని మీరు ఎన్నోచోట్ల వినే ఉంటారు. సినిమాల్లో, పాత కథల్లో ఈ విషయాన్ని చూసి నిజమేనేమో అని నమ్మేవారు కూడా లేకపోలేదు. అయితే దీని వెనుక ఉన్న అసలైన నిజాన్ని సైన్స్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. జీవం పోయిన మరుక్షణమే శరీరంలో ఎలాంటి పెరుగుదల అయినా పూర్తిగా ఆగిపోతుంది. జుట్టు లేదా గోళ్లు పెరగడానికి కణ విభజన జరగాలి. గుండె కొట్టుకోవడం ఆగిపోగానే రక్త ప్రసరణ నిలిచిపోయి, కణాలకు ఆక్సిజన్ అందడం పూర్తిగా ఆగిపోతుంది. శక్తిని ఇచ్చే ఏటీపీ ఉత్పత్తి కాకపోవడంతో కొత్త కణాలు పుట్టే అవకాశమే ఉండదు. కాబట్టి చనిపోయిన శరీరంలో గోళ్లు, జుట్టు పెరగడం అసాధ్యం.
పెరిగినట్టు ఎందుకు కనిపిస్తాయి?
మరణించిన తరువాత కూడా గోళ్లు పొడుగ్గా, గడ్డం పెరిగినట్లు ఎందుకు కనిపిస్తుంది అంటే, అది శరీరం సృష్టించే ఒక భ్రమ మాత్రమే. ప్రాణం పోయిన తర్వాత శరీరంలోని తేమ క్రమంగా ఆవిరైపోతూ ఉంటుంది. దీనివల్ల చర్మం, కండరాలు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురై ముడుచుకుపోతాయి. చేతి వేళ్ల కొనలు, క్యూటికల్స్ దగ్గర ఉండే చర్మం ఎండిపోయి వెనక్కి లాక్కుంటుంది. అలా చర్మం వెనక్కి వెళ్లినప్పుడు లోపల దాగి ఉన్న గోరు భాగం బయటకు కనిపిస్తుంది. అలాగే ముఖం మీది చర్మం కూడా బిగుసుకుని లోపలికి లాగడం వల్ల గడ్డం వెంట్రుకలు పైకి పొడుచుకు వచ్చినట్లు అనిపిస్తాయి. అంటే ఇక్కడ వెంట్రుకలు లేదా గోళ్లు పెరగట్లేదు, వాటి చుట్టూ ఉన్న చర్మమే వెనక్కి వెళ్లిపోతోంది.
ఐదు నిమిషాల్లో అంతా ఆగిపోతుంది
ఈ మార్పులు కాలక్రమేణా ఎలా జరుగుతాయో గమనిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాణం పోయిన మొదటి ఐదు నిమిషాల్లోనే కణాల పెరుగుదల శాశ్వతంగా ఆగిపోతుంది. రెండు గంటలు గడిచేసరికి శరీరం గట్టిపడి, వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే సూక్ష్మ కండరాలు బిగుసుకుని వెంట్రుకలు మరింత దళసరిగా అనిపిస్తాయి. ఇక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల సమయానికి చర్మం వేగంగా తేమను కోల్పోయి ఎండడం మొదలవుతుంది. రెండు నుంచి మూడు రోజులు పూర్తయ్యే సరికి చర్మం బాగా వెనక్కి లాగేసుకుంటుంది. దాంతో చూసేవారికి గోళ్లు పొడవుగా ఎదిగినట్లు, గడ్డం పెరిగినట్లు స్పష్టమైన భ్రమ కలుగుతుంది. ఈ దృశ్యభ్రమను చూసే జనం చావు తర్వాత కూడా అవి పెరుగుతున్నాయని భావిస్తుంటారు.





