- Home
- Andhra Pradesh
- Thunderstorm Alert : తెలుగు రాష్ట్రాల్లో రాకాసి వర్షాలు .. ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్
Thunderstorm Alert : తెలుగు రాష్ట్రాల్లో రాకాసి వర్షాలు .. ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్
Thunderstorm Alert : భారీ వర్షాలు కాదు చిరుజల్లుల వల్లకూడా కొన్ని ప్రాంతాలకు ప్రమాదం పొంచివుంది. ఈ రెండుమూడు గంటల్లో కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలుండటంతో రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.

ఏపీలో రాకాసి వర్షాలు... భయం భయం
Thunderstorm Alert : గత వారంరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేవీ లేవు... కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అడపాదడపా కురుస్తున్నాయి. దీంతో వరద ప్రమాదం తప్పింది... కానీ ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులతో మరికొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల వర్షపాతం తక్కువగానే ఉంటున్నా బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు భారీవర్షాల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి వర్షాల వల్ల ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరుగుతోంది. దీంతో చినుకు పడిందంటే చాలు ఏవైపు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తెలుగు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సాయంత్రం చిరుజల్లులతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడతాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏఏ జిల్లాలకు ఈ పిడుగుల ప్రమాదం ఎక్కువగా పొంచివుంది... ఏఏ జిల్లాల్లో కాస్త తక్కువగా ఉందో వెల్లడించింది... దీనిప్రకారం వివిధ రకాల అలర్ట్స్ జారీ చేసింది.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
రాబోయే రెండుమూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ. ఇలా కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కువగా పిడుగులు పడతాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఏపీలోని మరికొన్ని జిల్లాల్లో కూడా పిడుగులు పడే అవకాశాలున్నాయట... మరీముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్రమాదం ఎక్కువని APSDMA తెలిపింది. ఇలా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ పిడుగుల ప్రమాదం పొంచివుందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు చాలా ప్రమాదకమైనవి. మరీముఖ్యంగా పొలంపనులు చేసుకునే రైతులు, వ్యవసాయ కూలీలు, ఆరుబయట పనులు చేసుకునేవారు వీటివల్ల ప్రమాదాలబారిన ఎక్కువగా పడుతుంటారు. కాబట్టి ఈ పిడుగులు, ఈదురుగాలుల వల్ల ప్రమాదాలు జరక్కుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
1. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండరాదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు వర్ష సమయంలో ఎక్కువగా చెట్లకింద తలదాచుకుంటారు. దీనివల్ల పిడుగులు పడి, ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి ప్రమాదాల బారిన పడవచ్చు.
2. వర్షం కురిస్తుంటే బయటకు వెళ్లకపోవడమే మంచింది. అంటే ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్నవారు అక్కడే ఉండాలి... అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు రావాలి.
3. ఈదురుగాలుల వల్ల పెద్దపెద్ద హోర్డింగ్స్, ప్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతింటాయి... విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదముంటుంది. కాబట్టి వర్షంలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదు. అత్యవసరం అయితే సురక్షిత మార్గాలను ఎంచుకోవాలి.
4. పశువులు, ఇతర మూగజీవులను కూడా వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉంచరాదు. చెట్లపై పిడుగులు పడే ప్రమాదం ఎక్కువ.
5. తాత్కాలిక నివాసాల్లో అంటే పూరిగుడిసెలు, రేకుల షెడ్డుల్లో నివాసముండేవారు జాగ్రత్త. ఈదురుగాలుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి.
శ్రీకాకుళంలో పిడుగుపాటుకు ఇద్దరు బలి
ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ హెచ్చరించినట్లుగానే నిన్న(మంగళవారం) శ్రీకాకుళంలో పిడుగులు పడ్డాయి... ఇవి పెను ప్రమాదం సృష్టించాయి. గంగరాజుపురంలోని రాజ్‌యోగ్ మినరల్ గ్రానైట్ క్వారీపై పిడుగు పడింది... దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మరణించారు.. మరొకరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతులిద్దరు రాజస్థాన్ కు చెందినవారు కాగా గాయపడిన వ్యక్తి బీహార్‌కు చెందినవాడిగా గుర్తించారు. బ్రతుకుదెరువు కోసం వచ్చినవారిని ప్రకృతి బలితీసుకుంది... దీంతో ఆ నిరుపేద కుటుంబంలో విషాదం నిండిపోయింది.
తెలంగాణకూ పిడుగుల ముప్పు
తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండుమూడు గంటల్లో ఇలాంటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో కొన్నిప్రాంతాలకు పిడుగుల ప్రమాదం పొంచివుందని తెలిపింది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వాతావరణ విభాగం సూచిస్తోంది.
Light to Moderate rain or thundershowers at times intense spells likely occur in some parts of GHMC area during next 2-3 hours. pic.twitter.com/CkTFBgzM8v
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 8, 2025