Motivational Story: చెడు ఎదురైనా.. మంచే ఎందుకు వెతకాలి? ఈ రాజు కథ చదవాల్సిందే..!
Motivational Story: మనలో చాలా మంది చిన్న కష్టం, బాధ ఎదురైనా తమకే ఇలా ఎందుకు జరిగింది అని బాధపడుతూ ఉంటారు. కానీ, కష్టం వెనకే సుఖం కూడా ఉంటుంది అని తెలుసుకోలేరు. అసలు జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని ఎందుకు అనుకోవాలో ఈ రాజు కథ ద్వారా తెలుసుకుందాం

రాజు కథ
పూర్వం ఓ రాజ్యంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆ రాజు గారి దగ్గర ఎంతో తెలివైన ఓ మంత్రి ఉండేవాడు. అయితే... ఆ మంత్రి ఎప్పుడూ... ‘ అంతా మన మంచికే’ అని చెబుతూ ఉండేవాడు. ఆయన మాటలు మొదట్లో బాగానే అనిపించేవి. కానీ , ఒక రోజు జరిగిన సంఘటన ఆ రాజుగారి ఆలోచనే మార్చేసింది.
రాజు గారికి గాయం...
ఒకసారి రాజు వేటకు సిద్ధమౌతున్నప్పుడు అనుకోకుకండా కత్తి జారి ఆయన చేతి వేలికి పెద్ద గాయం అవుతుంది. నొప్పితో బాధపడుతున్న ఆయన మంత్రిని పిలుస్తాడు. ‘ చూడు, నా చేతికి గాయం అయ్యింది’ అని రాజు బాధగా చెప్తాడు. కానీ... మంత్రి ఎలాంటి విచారం లేకుండా, ప్రశాంతంగా ‘ మహారాజా, ఇది కూడా మన మంచికే జరిగింది’ అని అంటాడు.
మంత్రికి శిక్ష..
ఈ మాట వినగానే రాజు గారికి విపరీతంగా కోపం వచ్చేసింది. ‘ నా చేతికి గాయం కావడం నీకు మంచి విషయమా? నిన్ను ఇప్పుడే చెరసాలలో పెట్టేస్తాను’ అని ఆవేశంతో ఊగిపోతాడు. తర్వాత మంత్రిని చెరసాలలో పెట్టమని భటులను ఆజ్ఞాపిస్తాడు. రాజుగారు చెప్పినట్లే ఆ భటులు కూడా మంత్రిని జైల్లో వేస్తారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు రాజు కూడా వేటకు వెళ్లాడు. అక్కడ తెలీకుండా రాజు ఓ పొరపాటు చేస్తాడు. అది.. అక్కడి గిరిజన్లకు ఆగ్రహం కలిగిస్తుంది. వాళ్లు వెంటనే రాజును బంధించి... తమ గ్రామ దేవతకు బలి ఇవ్వాలి అనుకుంటారు. బలికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత... రాజు గారికి చేతికి గాయం తగిలి.. వేలు లేదనే విషయం గుర్తిస్తారు. ఇతను బలి ఇవ్వడానికి పనికిరాడు అని వదిలేస్తారు. చేతి తగిలిన గాయం కారణంగానే ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డాను అని రాజు గుర్తిస్తాడు.
అంతా మన మంచికే...
వెంటనే ఆనందంతో తన రాజ్యానికి వెళ్లి.. ఇదే విషయాన్ని తన మంత్రితో చెబుతాడు. ‘ నువ్వు చెప్పినట్లు గాయం నాకు మంచే చేసింది. కానీ, నువ్వు జైల్లో పడ్డావ్ కదా, నీకు జరిగిన మంచి ఏంటి?’ అని రాజు మంత్రిని ప్రశ్నిస్తాడు.
దానికి ఆ మంత్రి నువ్వుతూ‘ నేను జైల్లో లేకపోయి ఉంటే.. మీతో పాటు అడవికి వేటకు వచ్చేవాడిని. మీకు గాయం అయ్యింది కాబట్టి.. మిమ్మల్ని వదిలేసి.. నన్ను బలి ఇచ్చేవారు. జైల్లో ఉన్నాను కాబట్టే.. నేను ఇప్పుడు బతికి ఉన్నాను’ అని చెబుతాడు. ఈ మాట విని రాజుగారు మనస్ఫూర్తిగా నవ్వేశాడు. అప్పటి నుంచి.. రాజు కూడా ఏది జరిగినా.. మనకు మంచి జరగడానికే అని నమ్మడం మొదలుపెడతాడు.
జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక దివ్యమైన కారణం ఉంటుంది. కొన్ని కష్టాలు, కొన్ని గాయాలు కూడా మన మంచి కోసమే జరుగుతాయి. కాబట్టి, ఏది జరిగినా నిరాశ పడకూడదు. విశ్వం ఎప్పుడూ మన మంచి కోసమే పని చేస్తుంది.
మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురౌతూనే ఉంటాయి. ఉద్యోగం పోవడం, కోరుకున్న అవకాశాలు దొరకకపోవడం, ఇవన్నీ అప్పటికప్పుడు మనకు బాధ, నష్టం కలిగించొచ్చు. కానీ... కాలం గడిచిన తర్వాతే.. మనకు జరగాల్సిన అసలైన మంచి వేరే ఉంది అనే విషయం అర్థం అవుతుంది. అందుకే... దేనికీ నిరాశ చెందకూడదు. ప్రతి గాయం మనకు కొత్త పాఠాన్ని నేర్పుతుందని నమ్మితే సరిపోతుంది.