Story: దొరికిన దానితో తృప్తి పడే అలవాటు లేదా? ఈ పాము కథ చదవాల్సిందే..!
Story:మనలో చాలా మందికి అత్యాశ ఉంటుంది. జీవితంలో దొరికిన దానికి తృప్తి పడరు. ఇంకా ఏదో కావాలి అని ఆశపడుతూ ఉంటారు. అందుకోసం చాలా మంది వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటారు. ఇలా చేయడం వల్ల.. ఉన్నది కూడా పోతుంది. అది తెలియాలంటేఈ పాము కథ చదవాల్సిందే.

Moral Story
ఒక పెద్ద అడవిలో ఓ పాము ఉండేది. దానికి ఆ రోజు తినడానికి ఎలాంటి ఆహారం లభించలేదు. దీంతో చాలా సేపు ఆహారం కోసం వెతికింది. అయినా, ఏమీ దొరకకపోవడంతో.. ఒక చెట్టుమీద అలసిపోయి కూర్చొంది. కాసేపటికి ఆ చెట్టు పక్కనే చిన్న చెరువు ఉండటం గమనించింది. అందులో.... చాలా కప్పలు ఉన్నాయి. అవి ఎగురుతూ, గెంతుతూ ఆడుకుంటూ పాముకి కనిపించాయి. దీంతో.... పాముకి చాలా సంతోషం వేస్తుంది.
కప్పల గుంపు..
‘ చాలా కప్పలు ఉన్నాయి.. అన్నింటినీ తినేస్తే నా ఆకలి మొత్తం తీరిపోతుంది’ అని అనుకుంటుంది. వెంటనే.. ఆ కప్పలను తినడానికి వెళ్తుంది. కానీ... చిన్న అనుమానం వచ్చి ఆగిపోతుంది. ‘నాలుగైదు కప్పలు మాత్రమే నేను మింగగలను. మిగిలిన కప్పలన్నీ పారిపోతాయి కదా అప్పుడు అన్ని కప్పలను తినలేను కదా, కాసేపు ఆగి.. కప్పలన్నీ నిద్రపోయాక తిందాం’ అనుకొని పాము ఆగిపోతుంది.
సాయంత్రానికి చాలా కప్పలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కేవలం పది కప్పలు మాత్రమే మిగులుతాయి. అవి కూడా.. ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. ఈసారి మళ్లీ వెళ్లి.. ఆ కప్పలను తిందాం అని పాము అనుకుంటుంది. కానీ ఈ సారి కూడా.. మహా అయితే.. ఐదు కప్పలు తినగలను.. మిగిలిన ఐదు పారిపోతాయి కదా.. అన్నింటినీ ఒకేసారి తినేయాలి అని ఆగిపోతుంది.
పాము అత్యాశ..
ఇలా అన్ని కప్పలు తినాలి అని పాము ఎదురు చూసి చూసి.. సమయం కాస్త రాత్రి అయిపోతుంది. ఇంతలో దూరంగా ఉన్న పాము ఒక కప్ప కంట పడుతుంది. వెంటనే మిగిలిన కప్పలకు కూడా చెబుతుంది. అన్నీ కలిసి అక్కడి నుంచి పారిపోతాయి. చివరకు ఆ పాముకు తినడానికి ఒక్క కప్ప కూడా దొరకదు. ఆకలితోనే ఆ రాత్రి నిద్రపోవాల్సి వచ్చింది.
దీంతో... ఆకలితో బాధపడుతూ పాము కూడా బాధపడుతుంది. తన అత్యాశే.. తనకు ఆహారం దొరకకుండా చేసిందని తర్వాత తీరిగ్గా ఫీలౌతుంది.
నీతి కథ: అత్యాశకు పోతే...చివరకు ఏదీ మిగలదు.. అందుకే.. దొరికిన దానితో సంతృప్తి పడాలి.