Mandara parvatham: సముద్ర మథనానికి వాడిన మందర పర్వతాన్ని చూడలని ఉందా? ఎక్కడ ఉందో తెలుసా?
Mandara parvatham: సముద్ర మథనం చేసిన సమయంలో మందర పర్వతానే కవ్వంలా భావించి చిలికారు. అయితే ఇప్పుడు ఆ మందర పర్వతం ఎక్కడ ఉంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికీ మందర పర్వతం బీహార్లో కనిపిస్తుంది. లక్షలాదిమంది దీన్ని దర్శించుకుంటారు.

సముద్ర మథనం చేసిన పర్వతం
హిందూమత గ్రంథాలలో సముద్రం మథనం ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఈ మధనంలోనే లక్ష్మీదేవి జన్మించింది. అమృతం వచ్చింది. దేవతలను మరణమే లేని అమరులను చేసింది. ఇక ఇందులో వచ్చిన విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకుని గరళ కంఠుడయ్యాడు. సముద్రం మథనాన్ని చేయడానికి ఉపయోగించిన ఈ మందర పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ మందర పర్వతం బీహార్లోని బంకా జిల్లాలో ఉంది. సముద్రాన్ని చిలికిన మందర పర్వతం ఇదేనని చెప్పేందుకు కొన్ని పౌరాణిక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మందర పర్వతం పైనే విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడని అంటారు.
మందర పర్వతానికి ఎలా వెళ్లాలి?
బీహార్ లోని భాగల్పూర్ నగరం నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ పర్వతం కనిపిస్తుంది. 800 అడుగుల ఎత్తు ఉండే గ్రానైట్ కొండ ఇది. దూరం నుంచి చూస్తే ఈ కొండ చాలా అందంగా కనిపిస్తుంది. సముద్ర మదనం సమయంలో పురాణాల్లో చెప్పిన కొన్ని అంశాలు ఇప్పటికీ ఈ పర్వతంపై కనిపిస్తూనే ఉంటాయి. మందర పర్వతం పది మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న మందపాటి గీతలను తన చుట్టూ కలిగి ఉంటుంది. సముద్ర మదనం చేసేటప్పుడు వాసుకి అనే పెద్ద పామును ఈ పర్వతం చుట్టూ చుట్టి చిలికినట్టు చెబుతారు. దాని వల్ల ఈ గుర్తులు పడినట్టు వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడికి అంకితం చేసిన మధుసూదన ఆలయం కూడా ఈ పర్వతంపై ఉంది.
మధుసూదన ఆలయం
శ్రీకృష్ణుడికి చెందిన మధుసూదన దేవాలయం గర్భగుడిలో నల్లరాయితో చెక్కిన చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది. మధు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత కృష్ణుడు ఈ మందర పర్వతం పైనే విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని కృష్ణుడి జ్ఞాపకార్థం నిర్మించినట్టు వివరిస్తారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతినాడు మందర పర్వతం మీద మధుసూదన ఆలయంలో గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఎన్నో దూర ప్రాంతాల నుండి వస్తారు. ఈ ఉత్సవానికి గొప్పగా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఈ ఆలయం దగ్గరే పాప హరణి కుండ్ అనే చెరువు కూడా ఉంది. దాని లోపల శంఖం పెంకులు కనిపిస్తాయి.
మకర సంక్రాంతితో అనుబంధం
ప్రతి ఏడాది మధుసూదన ఆలయంలో శ్రీకృష్ణుడి రథోత్సవం జరుగుతుంది. ఉత్తర భారత దేశం నుండే కాదు దక్షిణ భారతదేశం నుండి కూడా శ్రీకృష్ణ భక్తులు భారీగా ఇక్కడికి తరలివస్తారు. భక్తులే స్వయంగా ఆ రధాన్ని లాగుతారు. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మనం మకర సంక్రాంతి నిర్వహించుకుంటాము. ఈ రోజే ఖర్మల ముగింపు కూడా జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు ఉత్తరం వైపుగా తన గమనాన్ని ప్రారంభిస్తాడు. అందుకే మకర సంక్రాంతిని దేవతల దినం అని పిలుస్తారు.

