Viral: ఏడు రూపాయల దొంగతనం కేసు, ఎన్నాళ్లు కోర్టులో నడిచిందో తెలుసా?
Viral: ఏడు రూపాయల చోరీ కేసును పోలీసులు కొన్నేళ్లుగా విచారణ చేస్తూ వచ్చారు. చివరికి కోర్టుకే విసుగెత్తి ఆ కేసును మూసి వేశారు. ఇదెప్పుడు జరిగిందో, ఎక్కడో జరిగిందో తెలుసా?

ముంబైలో చోరీ కేసు
దొంగతనం కేసులు ప్రతిరోజూ ఏదో ఒక చోట నమోదవుతూనే ఉంటాయి. అలాగే ముంబైలో ఓ చోరీ కేసు నమోదైంది. దాన్ని యాభై ఏళ్లుగా విచారణ చేస్తూనే ఉన్నారు. చివరికి కోర్టు ఆ కేసుపై తీర్పును ఇచ్చింది. ఏడు రూపాయల 65 పైసలు చోరీ చేసినందుకు పెట్టిన కేసు అది. 1977లో జరిగిన ఈ చోరీపై ఇప్పుడు తాజాగా మజాగావ్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటినుంచి దశాబ్దాలుగా ఎలాంటి పురోగతి లేకుండా పెండింగ్ లో పడిపోయిన కేసును కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదని న్యాయస్థానం చెప్పింది. దీనితో పెండింగ్ కేసులను క్లియర్ చేయడానికి ఈ పాత కేసును కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఏడు రూపాయల 65 పైసలు దొంగతనం చేసినందుకు 50 ఏళ్ల పాటు కేసుల్లో నలిగిపోయారు కొంతమంది.
ఇద్దరు దొంగలు
ఇక ఈ కేసు వివరాలను చూస్తే 1977లో దక్షిణ ముంబైలోని ఒక ప్రాంతంలో 7.65 రూపాయలు చోరీకి గురయ్యాయి. ఇప్పుడు చూస్తే అది చాలా చిన్న మొత్తమే అయి ఉండొచ్చు. కానీ అప్పటి కాలంలో మాత్రం అది కొంచెం ఎక్కువ డబ్బు. అప్పట్లో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. కొన్ని ఆధారాలు సేకరించినప్పటికీ నిందితులు తర్వాత దొరకలేదు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఆ ఇద్దరి నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా తెచ్చుకున్నారు పోలీసులు. అయినా కూడా వారి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.
అసలు వ్యక్తి ఆచూకీ లేడు
ఇక తన డబ్బు పోయిందంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంది. కేసు నమోదు అయ్యాక కొన్నాళ్లకు అతడు కూడా ఆచూకీ లేకుండా పోయాడు. అతడు వివరాలు, చిరునామా కూడా పోలీసులకు లభించలేదు. దీంతో కోర్టు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయింది. దీంతో ఈ కేసు ఫైళ్లల్లో అలా మగ్గి సంవత్సరాలు గడుస్తూ పోయాయి. తరాలు మారిపోయి 50 ఏళ్లుగా ఈ కేసులో ఎలాంటి విచారణ లేకుండా పెండింగ్లో పడిపోయింది. తాజాగా మజగావ్ న్యాయస్థానం పాత కేసులను త్వరగా క్లియర్ చేయాలనే దృష్టి పెట్టడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వానిదే ఏడురూపాయలు
కోర్టు ఈ కేసును సమగ్రంగా పరిశీలించి నిందితులు ఫిర్యాదుదారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ కేసును కొనసాగించడానికి ఎలాంటి ఉపయోగం లేదని కొట్టివేసింది. అలాగే నిందితులపై ఉన్న అభియోగాలను కూడా కొట్టివేసి కేసుకి ముగింపు పలికింది. అంతేకాదు అప్పట్లో రికవరీ చేసిన ఏడు రూపాయల 65 పైసలు మొత్తాన్ని ఫిర్యాదుదారుడు దొరికితే అతనికి ఇవ్వాలని లేకపోతే దాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని తెలిపింది.

