ఉద్యోగం వదిలేసి పీతల వ్యాపారంతో రోజుకు రూ.14 లక్షలు సంపాదిస్తున్న యువతి
పన్నెండేళ్లపాటూ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన అమ్మాయి.. ఆ జాబ్ వదిలేసి సొంతూరికి తిరిగొచ్చింది. వాళ్ల అమ్మ చేస్తున్న పీతల వ్యాపారంలోకి దిగింది. ఆ వ్యాపారంలో ఆమె సక్సెస్ సాధించింది. పండగ సీజన్‌లో ఈమె రోజువారీ సేల్స్ ఏకంగా రూ.14 లక్షలు దాటడం విశేషం.

పీతల వ్యాపారంతో లక్షల ఆదాయం
నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ తో పాటూ పీతలు, రొయ్యలు బాగా నచ్చుతాయి. పైగా పీతలు, చేపలు, రొయ్యలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. వీటితో బిజినెస్ సరిగ్గా చేస్తే లక్షలు సంపాదించవచ్చు. అదే చేసి చూపించింది ఓ అమ్మాయి. దేశం ఏదైనా కూడా ఒక వ్యక్తి విజయ గాధ మారిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి చైనాకు చెందినది. పేరు జియావో చెన్. చాలా ఏళ్లుగా ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. సడెన్‌గా ఆ జాబ్ వదిలేసి తన సొంతూరికి తిరిగొచ్చింది. అక్కడ వాళ్ల అమ్మ నడుపుతున్న పీతల (Crabs) వ్యాపారంలోకి దిగింది. ఇప్పుడు ఆ బిజినెస్‌ను దగ్గరుండి చూసుకుంటోంది.
చైనాలో జరిగే మిడ్-ఆటమ్ ఫెస్టివల్ సీజన్‌లో పీతలకు భలే డిమాండ్ ఉంటుంది. మన దగ్గర పండగలకు స్వీట్స్ కొన్నట్లు, అక్కడ పీతలు కొంటారు. ఈ సీజన్‌లో జియావో చెన్ రోజుకు లక్ష యువాన్లకు పైగా సేల్స్ చేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది సుమారు రూ.14.45 లక్షలు. అయితే ఇది కేవలం సేల్స్ మాత్రమే, లాభం కాదు.
12 ఏళ్ల పాటు విమానయాన రంగంలో..
జియావో చెన్ ఏవియేషన్ సెక్టార్‌లో దాదాపు 12 ఏళ్ల పాటు పనిచేసింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేయడం చాలామందికి డ్రీమ్. కానీ, ఆమె మాత్రం తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసుకుని కొత్త దారి ఎంచుకుంది.
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న నింగ్బో (Ningbo) అనే తీరప్రాంత నగరం ఆమె సొంతూరు. అక్కడ వాళ్ల అమ్మ అప్పటికే పీతల వ్యాపారం చేస్తోంది. ఆర్డర్లు పెరగడంతో ఆ బిజినెస్ చూసుకోవడానికి అదనపు సాయం అవసరమైంది. దీంతో జియావో చెన్ తన ఉద్యోగాన్ని వదిలేసి, సొంతూరికి వచ్చి ఫ్యామిలీ బిజినెస్‌లో చేరింది.
పీతల వ్యాపారంలోకి వచ్చాక జియావో చెన్ పనితీరు పూర్తిగా మారిపోయింది. విమానంలో ప్రయాణికులకు సేవలు అందించిన ఆమె.. ఇప్పుడు పీతలను సెలెక్ట్ చేయడం, ఆర్డర్లు రెడీ చేయడం, వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేయడం, డెలివరీలను మేనేజ్ చేయడం లాంటి పనులు చేస్తోంది.
వ్యాపారం పెరిగేకొద్దీ ఆర్డర్లను కరెక్ట్‌గా మేనేజ్ చేయడం, కస్టమర్లతో టచ్‌లో ఉండటం చాలా కీలకంగా మారింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసినప్పుడు నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ఆమె తన కొత్త బిజినెస్‌లో వాడటం మొదలుపెట్టింది. దీంతో ఫ్యామిలీ బిజినెస్ రోజువారీ పనులు చాలా ఈజీ అయ్యాయి.
సోషల్ మీడియా ద్వారా పెరిగిన బిజినెస్!
ఫ్యామిలీ బిజినెస్‌ను మరింత మంది కస్టమర్లకు చేర్చడానికి జియావో చెన్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌ను వాడుకుంది. పీతలను సెలెక్ట్ చేయడం నుంచి వాటిని ప్యాక్ చేసి పంపే వరకు.. బిజినెస్ వెనుక జరిగే పనులన్నింటినీ వీడియోలు తీసి పోస్ట్ చేసింది.
ఈ వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అవి చూసిన చాలామంది డైరెక్ట్‌గా ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో కేవలం లోకల్ కస్టమర్ల మీదే ఆధారపడకుండా, ఇతర ప్రాంతాల వాళ్లకు కూడా పీతలను అమ్మగలిగారు. కస్టమర్లతో ఈజీగా మాట్లాడే ఆమె టాలెంట్, సోషల్ మీడియా పవర్.. ఈ రెండూ బిజినెస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

