Fact Check: ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందా? ఫ్యాక్ట్‌చెక్ లో తేలింది ఇదే
Fact Check: తెలంగాణ పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఐబొమ్మ కూడా తగ్గేదే లే అన్నట్టు వారికి వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు వైరల్ గా మారాయి. అయితే, నిజంగానే ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందా? వైరల్ వార్తల్లో నిజం ఎంత? ఫ్యాక్ట్ చెక్ లో తెలుసుకుందాం.

పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్
సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసిందంటూ ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్‌షాట్‌లో సినీ నిర్మాతలు, హీరోల రెమ్యునరేషన్, విదశాల్లో షూటింగ్, బడ్జెట్‌లు, టికెట్ ధరలు వంటి అంశాలపై విమర్శలు ఉన్నాయి. చివరలో “మా వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే, నేను మీపై దృష్టి పెడతాం” అంటూ హెచ్చరిక లాంటి వాక్యం కనిపిస్తోంది.
ఒక ఎక్స్ (X) యూజర్ ఈ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ, “iBomma warns police. If the website is blocked, your phone numbers will be revealed” అని పేర్కొన్నాడు.
సినిమా పైరసీ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలు
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్‌ను బద్దలుకొట్టే చర్యలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఐదుగురిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. ఆ రాకెట్ వందల సినిమాలను ఆన్‌లైన్‌లో లీక్ చేసినట్లు ఆయన చెప్పారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే 2024లో సుమారు రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా 2023లో రూ.22,400 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే పైరసీ చేసే వాళ్లను పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఐబొమ్మ తిరిగి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము
దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి, అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నాము
త్వరలో ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాము – సీవీ ఆనంద్ https://t.co/XIM4PCtWNHpic.twitter.com/M2oEX6L4UT— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025
" There is nothing more dangerous than a man who has nothing to loose.."
ఈక కూడా పీకేలేరు అని ibomma భావం 😂😂 https://t.co/mUBOZh3Dg3pic.twitter.com/mz1pcRgyXL— Kumaruuu💙 (@CalmnessSoull) September 30, 2025
పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఫేక్ న్యూస్ : ఫ్యాక్ట్‌చెక్ లో బయటపడ్డ నిజం
ఆసియానెట్ న్యూస్ తెలుగు ప్రస్తుతం ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందనే వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ స్క్రీన్‌షాట్ 2023 నాటిది. అలాగే, అది తెలంగాణ పోలీసులను ఉద్దేశించి చేసిన వార్నింగ్ కాదు. తెలుగు సినిమా పరిశ్రమను ఉద్దేశించి iBomma ఒక నోటీసు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆసియానెట్ న్యూస్ తెలుగు నిర్మాతలకు ఐబొమ్మ హెచ్చరిక జారీ చేసిన కథనం కూడా రాసింది. అయితే, దానిని ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలతో పాటు కొందరు నెటిజట్లు వైరల్ చేస్తున్నారు.
ఐబొమ్మ వార్నింగ్ వార్తల పై తెలంగాణ ప్రభుత్వ ఏం చెప్పిందంటే?
తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఐబొమ్మ వార్నింగ్ అంటూ వస్తున్న వార్తల పై ఫ్యాక్ట్ చేక్ చేసింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎక్స్‌లో ఒక పోస్టులో.. “ప్రచారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అవి పోలీసులను ఉద్దేశించినవి కావు. తెలుగు సినిమా పరిశ్రమను ఉద్దేశించి వచ్చినవి. తెలంగాణ పోలీసులకు ఎలాంటి బెదిరింపులు రాలేదు” అని తెలిపింది.
అలాగే ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు వాస్తవాలను ధృవీకరించాలని విజ్ఞప్తి చేసింది.
#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు.
అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025
ఫ్యాక్ట్ చెక్ లో తేలిన నిజం
కాబట్టి, ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసిందన్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం. వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ 2023లో తెలుగు సినిమా పరిశ్రమపై వచ్చినది మాత్రమే. ప్రస్తుతం పోలీసులకు ఐబొమ్మ నుంచి ఎటువంటి హెచ్చరికలు లేదా బెదిరింపులు రాలేదని ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడైంది.