విజయ్ దేవరకొండలా బలికావద్దు... నిర్మాతలకు పైరసీ సైట్ సీరియస్ వార్నింగ్?
పైరసీ సైట్స్ ని నిర్మాతలు హెచ్చరించే పరిస్థితి నుండి ఓ పైరసి సైట్ పరిశ్రమను హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఐబొమ్మ పేరున ఓ వార్నింగ్ లెటర్ వైరల్ అవుతుంది.

గత రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను పైరసీ(Piracy) సమస్య వేధిస్తోంది. సినిమా విడుదలైన గంటల వ్యవధిలో ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక వరల్డ్ మాఫియా. ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు నిర్మాతలు పైరసీ కారణంగా కోల్పోతున్నారు. లీగల్ గా ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంటర్నెట్ అనే మహా సముద్రంలో దొంగలను పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. మూవీరూల్జ్, తమిళ్ రాకర్స్, వరల్డ్ ఫ్రీ 4 యూ, బాలీ4యూ, ఫిల్మీ వ్యాప్... వంటి సైట్స్ నిర్మాతల కంటిమీద కునుకు లేకుండా చేశాయి.
ఏం చేసినా పైరసీని నిర్మాతలు ఆపలేకపోయారు. చేసేది లేక పైరసీ చూడొద్దంటూ ప్రేక్షకులనే వేడుకునేవాళ్ళు నిర్మాతలు. ఓటీటీకి ఆదరణ పెరిగాక పైరసీ ప్రింట్స్ చూడటం చాలా మంది జనాలు వదిలేశారు. ప్రస్తుతం నిర్మాతలను ఐబొమ్మ(IBomma) భయపెడుతుంది. హైడెఫినిషన్ క్వాలిటీతో ఐబొమ్మలో ఏ సినిమానైనా చూడొచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటీటీలో విడుదలైన ప్రతి సినిమా అక్కడ ఉంటుంది. ఫ్రీగా కేవలం డేటా ఖర్చు చేసి చూసేయొచ్చు.
తాజాగా ఈ ఐబొమ్మ పైరసీ సైట్ ఏకంగా నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేసింది. మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోట్ అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఓ పైరసీ సైట్ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చే ధైర్యం చేసిందంటే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటున్నారు. ఇది పరిశ్రమ మనుగడకే సవాల్ అంటున్నారు.
వారు విడుదల చేసిన నోట్ లో మేటర్ పరిశీలిస్తే... తమపై ఫోకస్ పెట్టి నియంత్రించాలని చూస్తే పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు? బడ్జెట్ లో అధిక భాగం వాళ్ళకే చెల్లిస్తున్నారు. ఇతర నటులు, వర్కర్స్ అత్తెసరు పారితోషికంతో పని చేస్తున్నారు. విదేశాల్లో సినిమాలు తీసి బడ్జెట్ పెంచేసి... రికవరీ కోసం అధిక ధరలకు టికెట్స్ అమ్ముతున్నారు. సామాన్యుల మీద భారం వేస్తున్నారు.
చిత్ర పరిశ్రమకు మాకు జరిగే యుద్ధంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) (ఖుషి మూవీ గంటల వ్యవధిలో ఆన్లైన్ లో విడుదల చేశారు) మాదిరి మరో హీరో బలికావడం ఇష్టం లేదు. ముందు ఐబొమ్మ మీద కాకుండా కెమెరా ప్రింట్స్ విడుదల చేస్తున్న పైరసీ సైట్స్ పై ఫోకస్ పెట్టండి. చావుకు తెగించిన వాళ్లను ఇంకేదీ భయపెట్టలేదని... సుదీర్ఘంగా విమర్శల దాడి చేశారు.
ఐబొమ్మ లేవనెత్తిన కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ గా ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వాళ్లకు మద్దతుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ వార్నింగ్ లెటర్ ఎంత వరకు నిజం? వాస్తవంగా ఐబొమ్మ పైరసీ సైట్ లేఖ విడుదల చేసిందా? లేక వారి పేరున పరిశ్రమ పట్ల కోపం ఉన్నవారు చేసిన పనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఐబొమ్మ లేఖ టాలీవుడ్ ని కుదిపేస్తోంది...